
బడుల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం
అమరచింత: రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి అహర్నిషలు కృషి చేస్తూ రూ.వేల కోట్లు మంజూరు చేస్తోందని.. వార్షిక పరీక్షల్లో ఆశించిన ఫలితాలు సాధించకపోవడం ఏమిటని ఉపాధ్యాయులపై మంత్రి వాకిటి శ్రీహరి అసహనం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో రూ.25 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులు, అదేవిధంగా సింగంపేటలో రూ.20 లక్షలతో నిర్మించిన అంగన్‌వాడీ కేంద్ర భవనాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు కృష్ణవేణితో మాట్లాడి గతేడాది పది ఫలితాల్లో ఎంతమంది ఉత్తీర్ణత సాధించారని అడిగారు. ఇందుకు ఆమె స్పందిస్తూ మొత్తం 80 మంది విద్యార్థులకుగాను 36 మంది ఉత్తీర్ణత సాధించారని చెప్పడంతో అసహనం వ్యక్తం చేశారు. సగం మంది విద్యార్థులు కూడా ఉత్తీర్ణత సాధించకపోతే ఏం బోధిస్తున్నారని ప్రశ్నించారు. విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా ఉపాధ్యాయులను నియమించినా.. చదువు చెప్పడంలో ఎందుకు నిర్లక్ష్యమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని తనవంతుగా రూ.26 లక్షలు వెచ్చించి క్యూఆర్ కోడ్ కలిగిన పాఠ్య పుస్తకాలను నియోజకవర్గంలో ఉచితంగా పంపిణీ చేశామని, ఆశించిన ఫలితాలు ఎందుకు రాబట్టలేకపోయారని ఎంఈఓ, ఉపాధ్యాయులను ప్రశ్నించారు. పాఠశాలకు వచ్చిన ప్రతిసారి విద్యార్థులు, ఉపాధ్యాయులు అడిగిన వసతులు కల్పిస్తున్నామని, ఇంకా సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నామని.. వచ్చే ఏడాది వంద శాతం ఫలితాలు ఇవ్వకపోతే నిధులు ఇవ్వమని చెప్పారు. అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. ప్రభుత్వం బడుల బలోపేతంతో పాటు అంగన్‌వాడీలకు పక్కా భవనాలను నిర్మించి ఇస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసమే పని చేస్తోందని, ఇచ్చిన హామీలు అమలుచేస్తూ పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత సీఎం రేవంత్‌రెడ్డికే దక్కిందని తెలిపారు.
ప్రహరీ నిర్మాణానికి హామీ..
మండలంలోని తూక్యానాయక్‌తండా ప్రభుత్వ పాఠశాలకు ప్రహరీ లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని.. చుట్టుపక్కల ఉన్న పంటపొలాల నుంచి విషపు పురుగులు వస్తున్నాయని ప్రధానోపాధ్యాయుడు అనిల్‌కుమార్‌రెడ్డి మంత్రికి విన్నవించారు. ఇందుకు మంత్రి స్పందిస్తూ పీఆర్ అధికారులకు నివేదిక పంపిస్తే నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇన్‌చార్జ్ కలెక్టర్ యాదయ్య, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి కేశం నాగరాజుగౌడ్, డీసీసీ ప్రధానకార్యదర్శి అయ్యూబ్‌ఖాన్, మహేందర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యులు మహంకాళి విష్ణు, తిరుమల్లేష్, ఎంపీడీఓ శ్రీరాంరెడ్డి, ఎంపీఓ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
అడిగినన్నీ ఇస్తున్నా.. ఆశించిన ఫలితాలు రాకపోతే ఎలా?
మంత్రి వాకిటి శ్రీహరి