
కేసుల దర్యాప్తులో వేగం పెంచాలి
వనపర్తి: నిందితులు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోకుండా కేసుల దర్యాప్తు క్షుణ్ణంగా చేపట్టి పర్యవేక్షించాలని ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి జిల్లాలోని పోలీసు అధికారులతో ఎస్పీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పెండింగ్ కేసులపై సమీక్షించి పలు సూచనలు చేశారు. అండర్ ఇన్వెస్టిగేషన్‌లో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్, మిస్సింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి కేసు దర్యాప్తును నాణ్యతగా, త్వరితగతిన పూర్తిచేసి బాధితులకు అండగా ఉండాలన్నారు. అండర్ ఇన్వెస్టిగేషన్ పరిమితిలో ఉండాలని, పోక్సో, ఎస్సీ, ఎస్టీ, గ్రేవ్ కేసుల్లో విచారణ త్వరగా పూర్తి చేసి 60 రోజుల్లో కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలని సూచించారు. ప్రతి అధికారికి పూర్తి విచారణ, స్టేషన్ నిర్వహణ తెలిసి ఉండాలని, ప్రతిరోజు కేసులను ఆన్‌లైన్ నమోదు చేయాలన్నారు. భూ కేసుల ఛేదనకు ప్రత్యేక కార్యాచరణ ఉండాలని సీఐలకు సూచించారు. పోక్సో, అత్యాచార కేసుల్లో జిల్లా భరోసా కేంద్రం సేవలను వినియోగించుకొని బాధితులకు మెడికో, లీగల్ సేవలు అందిస్తూ, వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేయాలని, దోషులను న్యాయస్థానంలో నిలబెట్టాలని కోరారు. ఆన్‌లైన్ బెట్టింగ్స్, బెట్టింగ్ యాప్స్, ఆన్‌లైన్ మోసాలు, డ్రగ్స్ దుర్వినియోగం, ట్రాఫిక్ రూల్స్‌పై విద్యాసంస్థలు, గ్రామాలు, కూడళ్లలో కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా అవగాహన కల్పిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. సమీక్షలో డీసీఆర్బీ ఎస్‌ఐ తిరుపతిరెడ్డి, ఐటీ కోర్, డీసీఆర్బీ కమ్యూనికేషన్ పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.