
‘డీట్’.. యువతకు దిక్సూచి
నిరుద్యోగ యువతకు ఊరట
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన డీట్‌తో నిరుద్యోగ యువతకు ప్రయోజనం చేకూరుతుంది. యువత ఈ సదావకాశాన్ని సంపూర్ణంగా వినియోగించుకోవాలి. అప్పుడే ప్రభుత్వ సంకల్పం నెరవేరుతుంది. డీట్‌లో నమోదు చేసుకున్న యువత ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లోని కంపెనీల్లోని ఉద్యోగ ఖాళీల వివరాలు ఎప్పటికప్పుడు వారి ఫోన్లకు నోటిఫికేషన్లు అందుతాయి. వాటి ఆధారంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు.
– జ్యోతి,
జిల్లా పరిశ్రమల శాఖ అధికారి, వనపర్తి
● ‘డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ’తో ప్రైవేట్‌లోని ఉద్యోగ సమాచారం
● 1,500లకు పైగా నిరుద్యోగుల నమోదు
● నిరక్షరాస్యుడి నుంచి పీహెచ్‌డీ చేసిన అందరూ అర్హులే..
● ఎప్పటికప్పుడు ఫోన్లకు ఉద్యోగ ఖాళీల నోటిఫికేషన్లు
వనపర్తి: యువత ప్రభుత్వరంగంతో పాటు ప్రైవేట్ సంస్థల్లోనూ ఉద్యోగ అవకాశాలను అన్వేషించుకొని ఉపాధి పొందేందుకు ప్రభుత్వం తొలిసారిగా సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. డీట్ (డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ) పేరుతో రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు వారి అర్హతకు తగిన ఉద్యోగం ఎక్కడ ఉన్నా తెలిసేలా ఒక ప్లేస్‌మెంట్ వెబ్‌సెట్‌ను రూపొందించారు. పరిశ్రమలు, వాణిజ్యశాఖ పర్యవేక్షణలో ఈ వెబ్‌సైట్‌లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ రంగ కంపెనీలు, సంస్థలు, కనిష్టంగా 50 మందికి ఉద్యోగాలు కల్పించే శక్తి గల కంపెనీల్లో ఖాళీల వివరాలు ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేస్తుంటారు. ఇటీవల సీఎం ఎ.రేవంత్‌రెడ్డి అధికారికంగా ఈ వెబ్‌సైట్‌ను పెద్దపల్లి జిల్లాలో ప్రారంభించారు. ఈ మేరకు వనపర్తి జిల్లా నుంచి సుమారు 1,500 మంది నిరుద్యోగ యువత డీట్ వెబ్‌సైట్‌లో తమ విద్యార్హత, వివరాలతో రిజిస్టర్ చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లోని కంపెనీల్లో ఏర్పడిన ఉద్యోగ ఖాళీల వివరాల నోటిఫికేషన్ రిజిస్టర్ చేసుకున్న ప్రతి ఒక్కరి ఫోన్‌కు వస్తుంటాయి.
జిల్లాలో రెండు పరిశ్రమలకే అర్హత
డీట్‌లో ఇప్పటి వరకు జిల్లా నుంచి కొత్తకోట మండలంలోని కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరీ, పెబ్బేరు మండలంలోని ఏడీబీ లిక్కర్ ఫ్యాక్టరీ రెండు మాత్రమే నమోదు చేసుకున్నాయి. మరికొన్ని సంస్థలను రిజిస్టర్ చేయించే దిశగా జిల్లా పరిశ్రమలశాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. నిరక్ష్యరాస్యుల నుంచి ఎంఫిల్, పీహెచ్‌డీ విద్యార్హత ఉన్న వారి వరకు ఎవరైనా డీట్ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చు. ఒక్కచోట రిజిస్టర్ చేసుకున్న యువత రాష్ట్రంలో ఎక్కడైనా ప్రైవేటు రంగ సంస్థలో ఖాళీలు ఉంటే వారి విద్యార్హత బట్టి అర్హత కలిగి ఉంటారు. రిజిస్టర్ చేసుకున్న సమయంలో నిరుద్యోగి జాబ్ చేసే ఆసక్తి గల ప్రాంతాల పేర్లను మొదటి ప్రాధాన్యతగా ఎంపిక చేసుకోవాలి. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో ఎమ్మెల్యే అధికారులతో కలిసి డీట్ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఆసక్తి గల యువత www.deet.telangana.gov.in వెబ్‌సైట్‌లో వివరాలను నమోదు చేసుకోవాలి.
ప్రభుత్వ లక్ష్యం నెరవేరేందుకు..
రాష్ట్ర ప్రభుత్వం యువతకు ప్రైవేటు రంగంలోనూ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు డీట్‌కు రూపకల్పన చేసింది. ప్రభుత్వం లక్ష్యం నెరవేరాలంటే అధికారు లు ఈ విషయంపై పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించాలి. ఉద్యో గం కోసం ప్రయత్నిస్తున్న యువతను వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేయించాలి. ప్రభు త్వం తరఫను అధికారులకు అన్ని విధాగాలుగా సహకరిస్తాం. – తూడి మేఘారెడ్డి, ఎమ్మెల్యే, వనపర్తి

‘డీట్’.. యువతకు దిక్సూచి

‘డీట్’.. యువతకు దిక్సూచి