
కనులపండుగగా ఇమామే హుస్సేన్ సవారి
అమరచింత: అల్విదా షా.. అల్విదా షా హై హసన్, హూస్సేన్ అంటూ భక్తులు పీర్ల నిమజ్జన వేడుకలను సోమవారం కనులపండువగా నిర్వహించారు. మొహర్రం ను పురస్కరించుకొని 10 రోజులపాటు పీర్ల చావిడీల్లో కొలువుదీరిన ఆలం లను సోమవారం నిమజ్జనానికి తరలించారు. అమరచింత పట్టణంలో ఇమామే హుస్సేన్ ఆలం సవారీ వేడుకలు ఆది, సోమవారం రెండు రోజుల పాటు కొనసాగాయి. ఆదివారం రాత్రి ఇమామే హుస్సేన్ సవారీ వేడుకల్లో భక్తులు మొక్కులు చెల్లించుకోగా.. సోమవారం నిమజ్జనోత్సవం జరిపించారు. పట్టణ ప్రధాన రహదారులన్నీ జనంతో కిక్కిరిసిపోవడంతో ఆత్మకూర్ సీఐ శివకుమార్, ఆత్మకూర్, మదనాపురం ఎస్‌ఐలు సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు.
మాజీ ఎమ్మెల్యే ప్రార్థనలు
పట్టణంలోని పెద్దపీర్ల మసీదులో కొలువుదీరిన ఇమామే హుస్సేన్ ఆలం ను మంగళవారం మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి దర్శించుకొని చాదర్, పూలమాలలు సమర్పించిన మొక్కులు సమర్పించారు.