
‘కార్మికుల పని గంటల పెంపు సరికాదు’
కొత్తకోట: రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల 8 గంటల పని దినాన్ని 10 గంటలకు పెంచుతూ జులై 5న విడు దల చేసిన జీఓ 282ను వెంటనే రద్దు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు అబ్బాస్ డిమాండ్ చేశారు. సోమవారం కొత్తకోట చౌరస్తాలో సీఐటీయూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన పని గంటల పెంపు జీవో కాపీలను దహనం చేసి నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఈ జీవో పెట్టుబడిదారులు, కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసమే ఉద్దేశించబడిందని, ఇది అమలయితే కార్మికులు శ్రమ దోపిడికి గురవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మిక రంగంలో సంస్కరణలు అమలు పేరుతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్స్‌ను అమలు చేసేందుకు ఆరాటపడుతుందని ఆయన విమర్శించారు. లేబర్ కోడ్‌లో ప్రతిపాదించిన 10 గంటల పని దినాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 282 రూపంలో ముందుకు తీసుకురావడం దుర్మార్గపు చర్య అని ఆరోపించారు. ఈ నెల 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సన్నద్ధమవుతున్న తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులను మరింత రెచ్చగొట్టే విధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆవాజ్ ఉపాధ్యక్షుడు ఎండీ జబ్బార్, సహాయ కార్యదర్శి అజీజ్ పాషా, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బొబ్బిలి నిక్సన్, రాములు, నరసింహ, రాములు యాదవ్, కురుమన్న, బాలస్వామి, హమాలి కురుమన్న, బాబు, వెంకటన్న, లక్ష్మి పాల్గొన్నారు.