
ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి
● అదనపు కలెక్టర్ రెవెన్యూ జి.వెంకటేశ్వర్లు
వనపర్తి: ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ జి.వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్యతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ప్రజావాణి, మంత్రి ద్వారా ఈ జిల్లాకు సంబంధించిన ప్రజావాణి ఫిర్యాదులు, జిల్లా ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు సత్వరమే పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజావాణికి మొత్తం 50 ఫిర్యాదులు వచ్చినట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు.
దరఖాస్తుల ఆహ్వానం
వనపర్తి విద్యావిభాగం: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కోసం జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, ఎయి డెడ్ పాఠశాలలో పనిచేస్తున్న అన్ని కేటగిరీల్లోని ఉపాధ్యాయులు ‘జాతీయ స్థాయి అవార్డు 2025’ ఎంపిక కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘని సూచించారు. ఆసక్తి గల ఉపాధ్యాయులు https://nationa lawardstoteachers.education.gov.in వెబ్ సైట్ నుంచి నేరుగా ఈ నెల 13లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
నిబంధనలు పాటించని మిల్లర్లపై చర్యలు
వనపర్తి: జిల్లాలో సీఎంఆర్ బియ్యం విషయంలో ప్రభుత్వ నిబంధనలు పాటించని రైస్ మిల్లర్లపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా పౌరసరఫరాల అధికారి జగన్మోహన్ హెచ్చరించారు. సోమవారం పౌరసరఫరాల సంస్థ సమీకృత కార్యాలయంలో మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2023–24 సీజన్‌కు సంబంధించిన బియ్యం (ఎఫ్‌సీఐ) గడువు ఈ నెల 27వరకు ఉందని, బియ్యం సరఫరా చేయని మిల్లర్లు తప్పకుండా సరఫరా చేయాలని ఆదేశించారు. ప్రభుత్వానికి సకాలంలో బియ్యం ఇవ్వని మిల్లర్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 2024–25 సీజన్‌కు సంబంధించి సీఎంఆర్ బియ్యం ఇప్పటి వరకు మిల్లింగ్ చేయని మిల్లర్లకు సూచనలు చేశారు.
రామన్‌పాడుకు
కొనసాగుతున్న ఇన్‌ఫ్లో
మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో పూర్తి స్థాయి నీటి మట్టం 1,021 అడుగులకు గాను సోమవారం నాటికి 1,018 అడుగుల నీటి నిల్వ ఉంది. జూరాల ఎడమ, కుడి కాల్వ ద్వారా 550 క్యూసెక్కులు, సమాంతర కాల్వ ద్వార 750 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎన్‌టీఆర్ కాలువ ద్వారా 520 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వ ద్వారా 45 క్యూసెక్కులు, వివిధ లిఫ్టుల ద్వారా 872 క్యూసెక్కులు, తాగునీటి అవసరాల కోసం 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు.
‘పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయాలి’
వనపర్తి విద్యావిభాగం: ఉపాధ్యాయులకు పదోన్నతుల షెడ్యూల్‌ను విడుదల చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల అమరేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలతో పాటు వివిధ ప్రాథమిక ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులతో తపస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా అమరేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులపై ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయని, ఉపాధ్యాయులను నిర్లక్ష్యం చేసే ప్రభుత్వాలు కాలగర్భంలో కలిశాయన్నారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో విష్ణువర్ధన్, కరుణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వరప్రసాద్‌గౌడ్, సుదర్శన్, భాస్కర్, మనోహర్‌గౌడ్, శశివర్ధన్, రాములు, ప్రభాకర్, మదన్‌లాల్, కృష్ణప్రసాద్, నరేష్ తదితరులు ఉన్నారు.

ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి