
అసలేం జరుగుతోంది..
● ఆచూకీ లేని ఎస్‌ఐ, ఏఎస్‌ఐ
● అవినీతి ఆరోపణలతో వ్యక్తిగతసెలవుల్లో వెళ్లినట్లు ప్రచారం
● నేడు కొత్త ఎస్‌ఐ బాధ్యతలు తీసుకునే అవకాశం
అమరచింత: స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐ, ఏఎస్‌ఐలపై అవినీతి ఆరోపణల ఫిర్యాదులు ఉన్నతాధికారులకు అందాయన్న సమాచారంతో వారు వ్యక్తిగత సెలవులపై వెళ్లినట్లు మండలంలో జోరుగా చర్చ జరుగుతోంది. ఎస్‌ఐ, ఏఎస్‌ఐ వారం రోజులుగా స్టేషన్ రాకపోవడంతో అనుమానాలకు బలం చేకూరుతోంది. వీటికి తోడు పోలీసులు చెబుతున్న మాటలకు ఎంతమాత్రం పొంతన లేదు. రెండు నెలల కిందట మండలంలోని ధర్మాపురంలో జరిగిన క్రికెట్ గొడవల్లో వ్యక్తి మృతి చెందిన వ్యవహరంలో ఎస్‌ఐ సురేష్, ఏఎస్‌ఐ ప్రవర్తించిన తీరుపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో అంతర్గతంగా విచారణ జరిగి, ఉన్నతాధికారులు చర్యలకు సిద్ధమయ్యారని తెలవడంతో వారు సెలవులపై వెళ్లినట్లు తెలిసింది.
అవినీతి ఆరోపణలే అధికం
ఎస్‌ఐ మండలంలోని పలు ఘటనలో వ్యక్తిగతంగా ఫిర్యాదుదారులను బెదిరిస్తూ అందిన కాడికి దండుకోవడమే పనిగా పెట్టుకున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఇసుక, పీడీఎస్ బియ్యం అక్రమ సరఫరా, మట్టి తరలింపు, పొలం పంచాయితీల్లో జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు ప్రధానంగా ఉన్నాయి. దీంతో అధికార పార్టీ నాయకులతో కలిసి తమపై వచ్చిన అభియోగాలను రూపుమాపుకొనేందుకు యత్నాలు కొనసాగుతున్నట్లు తెలిసింది.
విధుల్లోకి వీఆర్‌లో ఉన్న ఎస్‌ఐ
వ్యవహారం కొలిక్కిరాకముందే జిల్లా కేంద్రంలో వీఆర్‌లో ఉన్న ఎస్‌ఐని బదిలీపై అమరచింతకు పంపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. మంగళవారం కొత్త ఎస్‌ఐ బాధ్యతలు తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎస్‌ఐ, ఏఎస్‌ఐ సెలవుల్లో వెళ్లడంపై విషయాన్ని ఆత్మకూర్ సీఐ శివకుమార్‌ను వివరణ కోరగా.. మంగళవారం విధుల్లో చేరుతారని బదులిచ్చారు. కానీ ఎస్‌ఐ, ఏఎస్‌ఐలు సస్పెండ్ అయ్యారనే వాదనలే ఎక్కువగా వినిపిస్తున్నాయి.