
బాలికల చదువు భావితరాలకు వెలుగు
కొత్తకోట రూరల్: బాలికల చదువు భావితరాలకు వెలుగునిస్తోందని.. తల్లిదండ్రులు ప్రోత్సహించాలని జిల్లా విద్యాధికారి అబ్ధుల్ ఘనీ అన్నారు. గురువారం పెద్దమందడి మండలం మద్దిగట్ల, మోజర్ల ఉన్నత పాఠశాలలో 2024–25లో 10వ తరగతి ఫలితాల్లో హేమమాలిని మండల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలువడంతో ఐకేపీ సంస్థ ప్రకటించిన రూ.25 వేల నగదు, తల్లిదండ్రులకు దుస్తులు డీఈఓ అందజేసి మాట్లాడారు. బాలికల విద్యను ప్రోత్సహించేందుకు ఐకేపీ సంస్థ నగదు, దుస్తులు అందజేయడం అభినందనీయమని కొనియాడారు. ప్రభుత్వం బాలికల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు, వసతిగృహాలు ఏర్పాటు చేస్తోందని.. 10వ తరగతి తర్వాత ఇంటర్ తప్పక చదివించాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల జీహెచ్‌ఎం ఎస్.వరప్రసాదరావు, ఉపాధ్యాయ బృందం, ఐకేపీ సభ్యులు, విదార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.