
అనర్హులకు ఇళ్లు కేటాయిస్తే చర్యలు
వనపర్తి రూరల్: అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ ఆదర్శ్ సురభి హెచ్చరించారు. గురువారం శ్రీరంగాపురం మండలంలో పర్యటించారు. మొదట కంభాళాపురం గ్రామంలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు వడ్ల భారతమ్మ, శైలజ ఇళ్లను పరిశీలించారు. ఆన్‌లైన్‌లో వివరాల నమోదు సమయంలో ప్రస్తుతం ఉంటున్న ఇంటి ఫొటోలు కాకుండా ప్లాట్ వద్ద దిగిన ఫొటోలు ఉండటంతో అనుమానం వచ్చిన కలెక్టర్ వారి ఇళ్ల వద్దకు వెళ్లి చూశారు. భారతమ్మ ఇల్లు శిథిలావస్థకు చేరడంతో కూలగొట్టుకోవడం చూశారు. శైలజ ఇల్లు చూసి ఇందిరమ్మ ఇంటికి అర్హురాలిగా నిర్ధారించారు. అనంతరం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో నిర్మిస్తున్న నమూనా ఇందిరమ్మ ఇంటిని పరిశీలించారు. పనులు నాణ్యతగా త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అక్కడి నుంచి శేరుపల్లికి చేరుకొని పక్కా ఇళ్లలో ఉంటున్న వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు సిఫారస్ చేసిన పంచాయతీ కార్యదర్శికి షోకాజ్ నోటీసు జారీ చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్యను ఆదేశించారు. కిందిస్థాయి ఉద్యోగి చేసిన సిఫారస్‌ను పరిశీలించకుండా అనుమతించినందుకు ఎంపీడీఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. ఉద్యోగులు పారదర్శకంగా పనిచేయాలని.. క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాకే సిఫారస్ చేయాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట హౌసింగ్ డీఈ విఠోభా, తహసీల్దార్ మురళిగౌడ్, ఎంపీడీఓ రవినారాయణ తదితరులు ఉన్నారు.