
పత్రికా స్వేచ్ఛను హరించడం సరికాదు
వనపర్తి విద్యావిభాగం: పత్రికా స్వేచ్ఛను హరించేలా సాక్షి తెలుగు దినపత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంటిపై ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఏపీ పోలీసులు అమానుషంగా దాడులు చేయడాన్ని జర్నలిస్టులు ముక్తకంఠంతో ఖండించారు. గురువారం సురవరం ప్రతాపరెడ్డి వనపర్తి ప్రెస్‌క్లబ్ (కమిటీ) ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో విలేకరులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. పత్రికా స్వేచ్ఛను కాలరాసేలా ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును ప్రెస్‌క్లబ్ నాయకులు తప్పుబట్టారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ చర్యపై న్యాయవ్యవస్థ, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్పందించాలని డిమాండ్ చేశారు. తనిఖీల పేరుతో వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలకు పూనుకోవడం హేయమైన చర్యగా నేతలు అభివర్ణించారు. నిజాలను నిర్భయంగా ప్రజలకు తెలియజెప్పే స్వేచ్ఛ పత్రికలకు ఉందని.. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు ఎదురుకావద్దని ఆకాంక్షించారు. తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారన్న దురుద్దేశంతో ఏపీ పోలీసులతో అక్రమంగా కేసులు నమోదు చేయించడం, వారి వ్యక్తిగత వ్యాపార సంస్థలు, ఇళ్లపై దాడులు నిర్వహించడం దురదృష్టకరమన్నారు. కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్ సభ్యులు బోలెమోని రమేష్, రాజు, కొండన్నయాదవ్, శ్రీనాథ్, తరుణ్, శ్రీనివాస్‌గౌడ్, పురుషోత్తం, గోపాలకృష్ణ యాదవ్, అంజి, యూసుఫ్, రాములు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు.