
లబ్ధిదారుల ఎంపిక వేగవంతం
వనపర్తి: జిల్లాలో రాజీవ్ యువవికాసం పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ తన చాంబర్‌లో రాజీవ్ యువవికాసం లబ్ధిదారుల ఎంపిక పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో రాజీవ్ యువ వికాసం పథకానికి 28,110 దరఖాస్తులు అందగా.. అర్హులైన యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రూ. 126.34 కోట్లు సబ్సిడీ రూపంలో మంజూరయ్యాయని చెప్పారు. ఇందులో వనపర్తి నియోజక వర్గానికి రూ.72.03 కోట్లు మంజూరు కాగా.. 15,388 దరఖాస్తులు వచ్చాయన్నారు. మక్తల్ నియోజవర్గానికి సంబంధించి రూ. 14 కోట్లు మంజూరు కాగా.. 3,114 దరఖాస్తులు వచ్చినట్లు వివరించారు. దేవరకద్ర నియోజకవర్గంలో 4,334 మంది దరఖాస్తు చేసుకోగా.. రూ.9.24 కోట్లు మంజూరయ్యాయన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గానికి రూ. 22.19 కోట్లు మంజూరు చేయగా.. 5,274 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ శాఖలకు వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా తనిఖీ చేసి.. నెలాఖరులోగా అర్హుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ యాదయ్య, డీఆర్డీఓ ఉమాదేవి, బీసీ సంక్షేమ శాఖ అధికారి ఇందిరా, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మల్లికార్జున్, మైనార్టీ కార్పొరేషన్ అధికారి అఫ్జలుద్దీన్ తదితరులు ఉన్నారు.
రాజీవ్ యువవికాసం పథకానికి 28,110 దరఖాస్తులు
నెలాఖరులోగా అర్హుల ఎంపిక
ప్రక్రియ పూర్తి
కలెక్టర్ ఆదర్శ్ సురభి