
పార్టీ కోసం పనిచేసే వారికే పదవులు
వనపర్తి: వందేళ్లకు పైగా చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ ఒక వటవృక్షం లాంటిదని.. పార్టీ నీడన ఉండే ప్రతి నాయకుడు, కార్యకర్తను కాపాడుకుంటామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జి.చిన్నారెడ్డి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో వారు మాట్లాడారు. నియోజకవర్గంలో కొందరు ప్రతిపక్ష నాయకులు శిఖండి రాజకీయాలు చేస్తూ.. కాంగ్రెస్ పార్టీలో కుటుంబ తగాదాలు ఉన్నాయంటూ అసత్య విమర్శలు చేస్తున్నారన్నారు. టీపీసీసీ ఆదేశాల మేరకు పరిశీలకులు సంజయ్ ముదిరాజ్, గౌరీ సతీష్ సమక్షంలో నిర్వహించిన ఈ సమావేశం తమ ఐక్యతను చాటుతోందన్నారు. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలోనే అప్పులకుప్పగా మార్చిందని మండిపడ్డారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేయాలని పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతం కోసం కొత్త, పాత భేదం లేకుండా పనిచేయాలని కోరారు. పార్టీ కోసం పనిచేసే వారికే పదవులు లభిస్తాయన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బి.శ్రీనివాస్‌గౌడ్, పీసీసీ డెలిగేట్ శంకర్ ప్రసాద్ తదితరులు ఉన్నారు.