
సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
వనపర్తి విద్యావిభాగం: జిల్లాలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. గురువారం నుంచి ఈ నెల 29వ తేదీ వరకు మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రథమ సంవత్సరం ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. జిల్లావ్యాప్తంగా 13 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా.. ప్రథమ సంవత్సరంలో 3,631 మంది, ద్వితీయ సంవత్సరంలో 2,092 మందితో కలిపి మొత్తం 5,723 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. పరీక్షలను పర్యవేక్షించేందుకు ఒక డీఈసీ, ఒక ఫ్లయింగ్ స్క్వాడ్, ఒక సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర, బాలికల జూనియర్ కళాశాలల్లో పరీక్ష కేంద్రాల ఏర్పాట్లను డీఐఈఓ ఎర్ర అంజయ్య పరిశీలించారు. జిల్లాలోని పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని.. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని ఆయన సూచించారు.
● నేటి నుంచి 29వ తేదీ వరకు
కొనసాగనున్న పరీక్షలు
● జిల్లాలో 13 కేంద్రాల ఏర్పాటు
● హాజరుకానున్న 5,723 మంది
విద్యార్థులు