
మిల్లర్లు ధాన్యం దించుకోవాల్సిందే..
వనపర్తి రూరల్: ప్రతి రైస్‌మిల్లులో 5వేల బస్తాల దొడ్డురకం వడ్లు కచ్చితంగా దించుకోవాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆదేశించారు. బుధవారం వనపర్తి మండలంలోని చిట్యాల గోదాముతో పాటు చిమనగుంటపల్లి, నాగవరం గ్రామాల్లోని రైస్‌మిల్లుల్లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. మిల్లుకు దొడ్డురకం వడ్లు వస్తే దింపుకోమని పక్కన పెట్టడానికి వీలు లేదన్నారు. కచ్చితంగా ప్రతి మిల్లులో దించుకోవాలన్నారు. అదే విధంగా వచ్చిన లారీలను త్వరగా అన్‌లోడ్ చేసే విధంగా హమాలీల సంఖ్య పెంచుకోవాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి కొనుగోలు కేంద్రానికి ఒక లారీ పెట్టాలని టాన్స్‌ఫోర్ట్ కాంట్రాక్టర్లను ఆదేశించారు.