
ధాన్యం కొనుగోళ్లలో నిబంధనలు తప్పనిసరి
వనపర్తి రూరల్/మదనాపురం: ధాన్యం కొనుగోళ్లలో కేంద్రాల నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, రైతులు తీసుకొచ్చిన ధాన్యంలో నాణ్యత పరిశీలించి కొనుగోలు చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు సూచించారు. మంగళవారం వనపర్తి మండలంలోని చిమనగుంటపల్లి, కడుకుంట్ల కొనుగోలు కేంద్రాలు, మదనాపురంలోని గోదాం, దంతనూరులోని లక్ష్మీనర్సింహ రైస్‌మిల్లును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్రాల్లో రైతుల వద్ద ధాన్యం తీసుకునేటప్పుడు తాలు, గడ్డి లేకుండా చూసి వెంటనే తూకం చేసి వెంటనే మిల్లులకు తరలించాలన్నారు. పాత గన్నీ బ్యాగులను కాకుండా కొత్తవాటిని రైతులకు అందించాలని కోరారు. కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, తూకాలు సక్రమంగా ఉండాలన్నారు. ఆయన వెంట మార్కెట్ చైర్మన్ పల్లెపాగ ప్రశాంత్, నాయకులు శేఖర్‌రెడ్డి, తహసీల్దార్ అబ్రహం లింకన్ తదితరులు ఉన్నారు.