జూరాల ఆయకట్టుకు వారంలో రెండ్రోజులే నీటి సరఫరా
●
రెండ్రోజులే అంటున్నారు..
అమరచింత ఎత్తిపోతల పథకానికి జూరాల ఎడమ కాల్వ నుంచి సాగునీరు అందుతుంది. ఎత్తిపోతల ఆయకట్టు కింద ఉన్న మూలమళ్ల, సింగపేట, ఖానాపురం, మస్తీపురం, అమరచింత, పాంరెడ్డిపల్లి గ్రామాల పరిధిలో యాసంగిలో 800 ఎకరాల్లో వరి సాగు చేశారు. ప్రాజెక్టు అధికారులు వారబందీ విధానంలో కోత విధించి కేవలం రెండ్రోజులు మాత్రమే నీటిని అందిస్తామని చెబుతున్నారు. దీంతో రైతులకు వాట్సాప్‌లో సమాచారమిస్తూ అప్రమత్తం చేస్తున్నాం.
– ఆంజనేయులు, ప్రధానకార్యదర్శి,
అమరచింత ఎత్తిపోతల పథకం
ఉన్నతాధికారుల ఆదేశాలతో..
జూరాల ప్రాజెక్టులో నిల్వనీటి మట్టం రోజురోజుకు పడిపోతుండటంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నీటి సరఫరాలో కోతలు విధించాల్సి వస్తోంది. ఉమ్మడి జిల్లా ప్రజలకు వేసవిలో తాగునీటి ఇబ్బందులు కలుగకుండా ఉండాలనే ఆలోచనలతో వారంతో రెండ్రోజులే కాల్వలకు నీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – జగన్మోహన్, ఈఈ,
జూరాల ప్రాజెక్టు ఎడమకాల్వ విభాగం
అమరచింత: ఈ ఏడాది యాసంగిలో ఆయకట్టు విస్తీర్ణం తగ్గించిన ప్రాజెక్టు అధికారులు సాగునీటి సరఫరాలో కోతలు విధించడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో నిల్వ నీటిమట్టం పడిపోతుండటంతో వారబందీ విధానంలో వారంలో నాలుగు రోజులు కాల్వలకు నీరు వదలాల్సి ఉండగా.. అధికారులు రెండ్రోజులకు కుదించారు. సోమ, మంగళవారం కాల్వలకు నీరు వదిలి బుధవారం నుంచి నిలిపివేయనున్నారు. ఈ విధానాన్ని ప్రాజెక్టు అధికారులు ఈ నెల 2 నుంచి ప్రారంభించారు. ఏప్రిల్ 15 వరకు నీరందితేనే పంట చేతికందే అవకాశం ఉందని.. అకస్మాత్తుగా నీటి విడుదలను కుదిస్తే పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ప్రాజెక్టు అధికారులకు విన్నవించుకుంటున్న పరిస్థితులు తలెత్తాయి.
సామాజిక మాధ్యమాల్లో సందేశాలు..
జూరాల ఎడమ కాల్వకు అనుసంధానంగా ఉన్న అమరచింత ఎత్తిపోతల పథకం ఆయకట్టు రైతులకు లిఫ్ట్ నిర్వాహకులు నీటి కుదింపుపై వాట్సాప్ సందేశాలు పంపుతుండటంతో ఆయకట్టు రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఇకపై వారంలో రెండ్రోజులే కాల్వలకు నీటిని వదులుతున్నారని.. రైతులు పంటలు ఎండకుండా సాగునీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచిస్తుండటంతో రైతులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు.
ప్రాజెక్టులో నీటిమట్టం కేవలం 3.50 టీఎంసీలే..
బుధవారం నుంచి కాల్వలకు నీరు నిలిపివేత
ఆయకట్టు రైతుల్లో మొదలైన ఆందోళన
కుడి, ఎడమ కాల్వల పరిధిలో 35 వేల ఎకరాల సాగు
అన్నదాత.. ఆందోళన
అన్నదాత.. ఆందోళన