మత్స్యశాఖ డీడీగా లావణ్య | - | Sakshi
Sakshi News home page

మత్స్యశాఖ డీడీగా లావణ్య

May 31 2026 1:00 AM | Updated on May 31 2026 1:00 AM

విజయనగరం ఫోర్ట్‌: మత్స్యశాఖ డీడీ(డిప్యూటీ డైరెక్టర్‌)గా ఎం.లావణ్య శనివారం బాధ్యతలు స్వీకరించా రు. కాకినాడ మత్స్యశాఖ కార్యాలయంలో ఏడీ(అసిస్టెంట్‌ డైరెక్టర్‌)గా పనిచేసిన ఈమె ఉద్యోగోన్నతిపై విజయనగరానికి వచ్చారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఆమెకు సిబ్బంది అభినందనలు తెలిపారు.

ఆరోగ్యశ్రీ టీమ్‌లీడర్‌కు షోకాజ్‌ నోటీస్‌

విజయనగరం ఫోర్ట్‌: ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్‌ వైద్యసేవ)లో టీమ్‌లీడర్‌గా పనిచేస్తున్న ఆర్‌.ఎం.నాయుడు టీడీపీ నిర్వహించిన మహానాడులో మంత్రితో పాటు చిందులు వేసిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై ‘మహానాడులో చిందేసిన ఆరోగ్యశ్రీ ఉద్యోగి’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురించిన వార్తకు సంబంధిత అధికారులు స్పందించారు. టీమ్‌ లీడర్‌ ఆర్‌.ఎం.నాయుడుకు షోకాజ్‌ నోటీస్‌ జారీ చేసినట్టు కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ కె.సాయిరాం తెలిపారు.

21న ‘రీ–నీట్‌’

జిల్లాలో 7 కేంద్రాలు

హాజరుకానున్న విద్యార్థులు 1,901 మంది

విజయనగరం అర్బన్‌: నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఆధ్వర్యంలో ఈ నెల 21న నిర్వహించనున్న ‘రీ–నీట్‌’ ప్రవేశ పరీక్షకు జిల్లాలో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అఽధికారి సత్తిబాబు తెలిపారు. తన చాంబర్‌లో పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో ఆయన శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ రోజు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు జిల్లాలోని 7 పరీక్ష కేంద్రాల్లో నీట్‌ జరుగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,901 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ప్రశ్నప్రత్రాల భద్రత, గోప్యత విషయంలో ఎటువంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని అధికారులకు హెచ్చరికలు జారీచేశారు. సమావేశంలో నీట్‌ సిటీ కోఆర్డినేటర్‌, కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్‌ దిలీప్‌ మోదీతో పాటు వివిధ శాఖల అధికారులు, ప్రిన్సిపాల్స్‌, చీఫ్‌ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.

వడదెబ్బతో వేతనదారు మృతి

బొండపల్లి: ఉపాధిహామీ పనులకు వెళ్లిన వేతనదారు ఇంటికి వచ్చే క్రమంలో తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. కుటుంబ సభ్యులు, వేతనదారులు తెలిపిన వివరాల ప్రకారం.. బొండపల్లి మండలం కనిమెరక గ్రామానికి చెందిన తెలుగు అప్పన్న (53) గ్రామంలో జరుగుతున్న ఉపాధి పనులకు శనివారం వెళ్లారు. ఉదయం పదిన్నర గంటల సమయంలో ఇంటికి చేరే క్రమంలో ఎండకు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికులు కలిసి గజపతినగరంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. అక్కడ చికిత్స పోందుతూ కొద్ది క్షణాల్లో మృతి చెందారు. ఆయనకు భార్య బంగారమ్మ, కుమారుడు శ్రీనివాసరావు, కుమార్తె ఎర్రయ్యమ్మ ఉన్నారు. ఇంటిపెద్ద వడదెబ్బకు గురై మృతిచెందడంతో కన్నీరుపెడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement