● స్మోకింగ్ ప్రమాదకరం
● వ్యసనానికి బానిసలవుతున్న యువత
● అలవాటు మానుకోవాలంటున్న వైద్యులు
● నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం
విజయనగరం ఫోర్ట్: స్మోకింగ్ (పొగ తాగడం) ప్రస్తుత సమాజంలో ఫ్యాషన్‌గా మారిపోయింది. పెద్దవాళ్లు చుట్టలు, బీడీలు కాల్చితే, యువత సిగరెట్స్, ఈ సిగరెట్స్ తాగుతున్నారు. పొగ తాగడం, పొగాకు ఉత్పత్తుల తినడం వల్ల ప్రాణాంతకమైన వ్యాధులు వ్యాపిస్తాయి. అయినప్పటకీ పొగ తాగే వారి సంఖ్య రోజురోజుకూ పెరగడం ఆందోళన కలిగిస్తున్న అంశం. ఆదివారం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం సందర్భంగా సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం.. ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంల్లో పొగే తాగేవారు ఎక్కువుగా ఉన్నారు. చుట్టులు, బీడీలు, సిగరెట్‌ల రూపంలో తెగ కాల్చేస్తున్నారు. ముఖ్యంగా అడ్డ పొగ (రివర్స్ స్మోకింగ్) తాగేవారు ఎక్కువుగా ఉన్నారు. ఇది చాలా ప్రమాదకరం. పొగ తాగేవారితో పాటు, వారి పక్కనుండే వారు వ్యాధుల బారిన పడుతున్నారు.
పొగ తాగడంవల్ల వచ్చే వ్యాధులు..
పొగ తాగడం వల్ల సీఓపీడీ, నిమోనియా, క్రానిక్ బ్రాంక్‌టైస్, గొంతు క్యాన్సర్ , ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి వ్యాధులు ప్రబలడంతో పాటు గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. గుండె పోటుకు గురైన ప్రతి ముగ్గురిలో ఒకరు ధూమపానం బాధితులేనని నివేదికలు చెబుతున్నాయి. మధమేహం ఉన్న వారు పొగ తాగడం వల్ల వ్యాధి అదుపులో ఉండదు. దీని వల్ల ఆ ప్రభావం కిడ్నీలు, లివర్, కళ్లు వంటి కీలకమైన అవయవాలపై పడుతుంది.
యువత అలవాటు పడుతున్నారు..
ఒకరి నుంచి మరొకరు పొగ తాగడం అలవాటు చేసుకుంటున్నారు. ముఖ్యంగా 30 ఏళ్ల లోపు వారు ఎక్కువుగా పొగ తాగుతున్నారు. కొంతమంది సిగరెట్స్ స్థానంలో ఈ సిగరెట్స్ ఎక్కువుగా తాగుతున్నారు. ఇది కూడా చాలా ప్రమాదకరం. ఊపిరిత్తులు పూర్తిగా దెబ్బతింటాయి. గతంలో నిరక్ష్యరాస్యులు, గ్రామీణ, గిరిజన ప్రాంత వాసులు ఎక్కువుగా చుట్టలు, సిగరెట్‌లు తాగేవారు. కానీ నేడు పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ప్రతిఒక్కరూ స్మోకింగ్‌కు అలవాటు పడుతున్నారు. ఇదిలా ఉంటే అడ్డపొగ మరీ ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు.
అత్యంత ప్రమాదకరం..
పొగతాగడం అత్యంత ప్రమాదకరం. పొగాకు ఉత్పత్తులు నమలడం వల్ల కూడా జీవితకాలం తగ్గిపోతుంది. సాధారణంగా 70 ఏళ్లు జీవించేవారు 60 నుంచి 65 ఏళ్లకే మరణిస్తారు. ఊపరితిత్తులు, గొంతు క్యాన్సర్‌తో పాటు మూత్రాశయం, లివర్ వ్యాధులు సోకే అవకాశం ఉంది. పొగ తాగడం వల్ల మధుమేహం, గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులు చాలా ఇబ్బందులు పడతారు. ప్రతి నెలా 1500 నుంచి రెండు వేల మంది వరకు ప్రాణాంతకమైన వ్యాధులతో బాధపడుతూ ఆస్పత్రికి వస్తున్నారు. వీరంతా పొగాకు బాధితులే. – డాక్టర్ బొత్స సంతోష్‌కుమార్,
పలమనాలజిస్ట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి


