విజయనగరం ఫోర్ట్: రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించిండి.. ప్రకృతి సాగు పద్ధతిలో వ్యవసాయం చేయండంటూ టీడీపీ సర్కార్ పదేపదే గొప్పలు చెబుతోంది. కాని ఆచరణలో మాత్రం అమలు చేయడం లేదు. ప్రకృతి సాగును ప్రోత్సహించే క్రమంలో భూసారాన్ని పెంచేందుకు అవసరమైన పచ్చిరొట్ట ఎరువుల ధరలను తగ్గించి రైతులకు అందించాలి. అవసరమైతే ఉచితంగానైనా ఇవ్వాలి. కాని కూటమి ప్రభుత్వం పచ్చిరొట్ట ఎరువు ధరలను పెంచేసింది. ఇప్పటికే రసాయన ఎరువుల ధరలు పెరగడం వల్ల రైతుల సాగుకు వెనుకాడే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పచ్చిరొట్ట ఎరువుల ధరల పెరగడం రైతులను మరింత ఇబ్బందుల్లోకి నెట్టేసింది.
3409 క్వింటాళ్లు కేటాయింపు..
2026 ఖరీఫ్ సీజన్‌కు సంబంఽధించి జిల్లాకు 3,409 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు కేటాయించారు. ఇందులో జీలుగ విత్తనాలు 1,819 క్వింటాళ్లు , జనుము విత్తనాలు 1137 క్వింటాళ్లు, పిల్లిపెసర విత్తనాలు 453 క్వింటాళ్లు ఉన్నాయి.
జిల్లాపై రూ. 1.27 కోట్ల భారం..
కూటమి సర్కార్ పచ్చిరొట్ట ఎరువు ధరల విత్తనాలు పెంచడం వల్ల జిల్లాపై కోట్లాది రుపాయల భారం పడనుంది. జిల్లా వ్యాప్తంగా రైతాంగంపై రూ.1.27 కోట్ల భారం పడనుంది. జీలుగ, కట్టిజనుము,పిల్లిపెసర విత్తనాలపై క్వింటకు రూ. 3,700 నుంచి 4,500 రూపాయల వరకు పెంచారు.
పచ్చిరొట్ట ఎరువు ధరలు పెంచేసిన టీడీపీ సర్కార్
ఖరీఫ్ సీజన్‌కు 3,409 క్వింటాళ్ల విత్తనాలు కేటాయింపు
విత్తనాల ధరలు రూ. 3700 నుంచి 4,500 రూపాయల వరకు పెంపు
పచ్చిరొట్ట ఎరువుతో
అనేక ప్రయోజనాలు..
పచ్చిరొట్ట ఎరువులైన జీలుగ, జనుము, పిల్లిపెసరల్లో ఎదో ఒకటి వరి పంట సాగు చేయడానికి 40 రోజులు ముందు పొలంలో సాగు చేయాలి. పంట పెరిగిన తర్వాత పంటను బాగా కలియదున్నాలి. దీని వల్ల భూసారం పెరుగుతుంది. భూమికి కావాల్సిన నత్రజని లభిస్తుంది. దీని వల్ల యూరియా వాడకం తగ్గుతుంది. పంట దిగుబడి కూడా పెరుగుతుంది. – ఎ. శ్రీనివాసరావు,
ఏఓ, విజయనగరం


