మట్టి పరీక్ష.. రైతుకు రక్ష | - | Sakshi
Sakshi News home page

మట్టి పరీక్ష.. రైతుకు రక్ష

Apr 7 2026 9:25 AM | Updated on Apr 7 2026 9:25 AM

పోషక లోపాలను భర్తీ చేయాలి

భూమిలో పోషక లోపాలను భర్తీ చేయాలి. మట్టి నమూనా పరీక్ష ఫలితాలను రైతులకు తెలియజేస్తున్నాం. ఈ ఏడాది 30,265 మట్టి పరీక్షలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటివరకు 2500 పరీక్షలు చేశాం. ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభమయ్యే లోపు పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహించి వాటి ఫలితాలను రైతులకు అందజేస్తాం. జిల్లాలో నత్రజని, సేంద్రియ కర్బనం, జింక్‌ లోపం అధికంగా ఉంది. దీనిని నివారించుకుంటే అధిక దిగుబడులు సాధించవచ్చు.

– జి. శ్రీనివాస్‌, ఎ.డి, భూసార పరీక్ష కేంద్రం

విజయనగరం ఫోర్ట్‌: మట్టి పరీక్ష (భూసార పరీక్ష) ఫలితం ప్రకారం ఎరువులు వినియోగించడం వల్ల రైతుపై ఆర్థిక భారం తగ్గుతుంది. దీంతో మట్టి పరీక్ష రైతుకు రక్షగా మారిందనే చెప్పాలి. భూసార ఫలితాల ప్రకారం ఏయే భూములకు ఏయే ఎరువులు వేయాలో అధికారులు వివరిస్తారు. దీంతో అదనపు ఎరువుల వినియోగం ఉండదు. ఈ ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 30,265 మట్టి నమూనాలు ( శాంపిల్స్‌) సేకరించి, పరీక్షించాలన్నది వ్యవసాయ శాఖ లక్ష్యం కాగా ఇప్పటికే నమూనాలు సేకరించారు. ఇందులో 2,500 పరీక్షలు కూడా పూర్తి చేశారు. భూసార పరీక్ష కోసం 15 సెం.మీ లోతులో వి షేప్‌ ఆకారంలో మట్టి నమూనాలు సేకరించారు.

13 రకాల పరీక్షలు..

సేకరించిన ప్రతి మట్టి నమూనాకు 13 రకాల పరీక్షలు నిర్వహిస్తారు. నేల స్వభావం, ఉదజని సూచిక (పీహెచ్‌), లవణ సూచిక (ఈసీ), సేంద్రియ కర్బనం ( ఓసీ) లభ్య నత్రజని (ఎన్‌), లభ్య భాస్వరం’, లభ్య పొటాష్‌, లభ్య గంధకం, లభ్య జింకు, లభ్య ఇనుము, లభ్య మాంగనీసు, లభ్య రాగి, బోరాన్‌ పరీక్షలు చేపడతారు. వీటిల్లో ఏ లోపం ఉన్నా సంబంధిత రైతుకు తెలియజేసి, లోప నివారణకు చేపట్టాల్సిన చర్యలపై అవగాహన కల్పిస్తారు.

గతేడాదిలో 28, 392 పరీక్షలు..

భూసార పరీక్ష కేంద్రం సిబ్బంది 2025 – 26లో జిల్లా వ్యాప్తంగా 28, 392 పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల ద్వారా జిల్లా వ్యాప్తంగా భూముల్లో నత్రజని లోపం 92 శాతం, సేంద్రియ కర్బనం 86 శాతం, జింక్‌ లోపం 36 శాతం ఉన్నట్టు గుర్తించారు. నత్రజని లోపం పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పంట ఎదుగుదల లోపించడంతో పాటు దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. నత్రజని, సేంద్రియ కర్బన పోషకాల భర్తీకి పశువులు గత్తం, వర్మీకంపోస్టు పొలాల్లో వేసుకోవాలి. లేదంటే జీలుగ, కట్టి జనుము, పిల్లిపెసర వంటి పచ్చి రొట్ట ఎరువులు సాగుచేసి భూముల్లో కలియ దున్నాలి. సేంద్రియ కర్బనం లోప నివారణకు ఏడాది పొడవునా ఏదో ఒక పంట సాగు చేయాలి. జింక్‌ లోపం నివారణకు ప్రతి మూడేళ్లకోసారి ఎకరానికి 20 కిలోల జింక్‌ వేసుకోవాలి. జిల్లాలోని అన్ని మండలాల్లో నత్రజని, సేంద్రియ కర్బనం, జింక్‌ లోపం ఉంది.

జిల్లా వ్యాప్తంగా చేయాల్సిన

పరీక్షల లక్ష్యం 30,265

ఇప్పటికే మట్టి నమూనాల

సేకరణ పూర్తి

ప్రస్తుతానికి 2500 నమూనాల

పరిశీలన

గతేడాది 28,392 భూసార

పరీక్షలు చేసిన అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement