● 228 వినతుల స్వీకరణ..
విజయనగరం అర్బన్: జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి తమ సమస్యలపై వినతిపత్రాలు, ఫిర్యాదులు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న వినతులను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఆలస్యం జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. ముఖ్యంగా రెవెన్యూ, సర్వే సమస్యలపై వేగంగా స్పందించాలని ఆదేశించారు. పీజీఆర్‌ఎస్ వినతులపై డిజిటల్ పర్యవేక్షణ కొనసాగుతోందని తెలిపారు. 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా వచ్చే ఫిర్యాదులను కూడా బాధ్యతగా పరిష్కరించాలని సూచించారు. అర్జీదారులను ప్రత్యక్షంగా కలిసిన తర్వాతే ఎండార్స్‌మెంట్ ఇవ్వాలని.. మాట్లాడిన తేదీ, సమయం నమోదు చేయాలని సూచించారు. మొత్తం 228 వినతులు అందగా అందులో 89 రెవెన్యూ శాఖకు సంబంధించినవే ఉండడం విశేషం. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్, జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్.సత్తిబాబు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఆర్‌డీఓలు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


