కొమరాడ: మండలంలోని గుణదతీలేస్ పంచాయతీ బిన్నిడి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రెడ్డి శ్రీనివాసరావు రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రథమ స్థానం సాధించాడు. రెండు రోజులుగా రాజాం జీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో జరుగుతున్న పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ఆయన పాల్గొన్నారు. మాస్టర్స్ విభాగంలో ప్రథమ స్థానం సాధించడంతో పలువురు ఆయన్ను అభినందించారు.
సుందరపేట సీహెచ్‌సీలో అరుదైన శస్త్రచికిత్స
పూసపాటిరేగ: భోగాపురం మండలం సుందరపేట సీహెచ్‌సీలో సోమవారం అరుదైన శస్త్రచికిత్స చేశారు. వివరాల్లోకి వెళితే.. చోడిపిల్లిపేటకు చెందిన చోడిపిల్లి దేవి ప్రసవం కోసం సుందరపేట ఆస్పత్రిలో చేరింది. పురిటినొప్పులు రావడంతో వైద్యులు ప్రసవం జరిపించగా.. బిడ్డ సగం వచ్చి నిలిచిపోవడంతో వెంటనే వైద్యులు అలేఖ్య, సునీల్ స్పందించి అతి కష్టంమీద శస్త్రచికిత్స చేసి బిడ్డను బయటకు తీశారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.
ఆటో డ్రైవర్‌కు రిమాండ్
బొండపల్లి: మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడంతో పాటు పరిమితికి మించి ప్రయాణికులతో పట్టుబడిన ఆటో డ్రైవర్‌కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ గజపతినగరం ఫస్టక్లాస్ మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి ఎ.విజయ్ రాజ్‌కుమార్ సోమవారం తీర్పు చెప్పారని ఎస్సై యు. మహేష్ తెలిపారు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని కెరటాం గ్రామానికి చెందిన తలే నారాయణ రెండు రోజుల కిందట ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులతో వెళ్తూ మండల కేంద్రంలో పోలీసులకు పట్టుబడ్డాడు. ఆ సమయంలో ఆయన మద్యం మత్తులో ఉండడంతో పాటు ఆటోకు ఇన్సూరెన్స్ కూడా లేదు. దీంతో ఎస్సై మహేష్ కేసు నమోదు చేసి నిందితుడ్ని సోమవారం కోర్టులో హాజరుపరచగా..న్యాయమూర్తి రిమాండ్ విధిస్తూ తీర్పు చెప్పారు.
మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
వంగర: మండల పరిధి శివ్వాం గ్రామానికి చెందిన కొక్కిరెడ్డి గణేష్ (32) ఉరి వేసుకుని ఆత్మ హత్యకు పాల్పడ్డాడు. మద్యం తాగుతూ బాధ్యతారాహిత్యంగా తిరుగుతున్నాడంటూ తల్లి దుర్గమ్మ, మేనత్తలు మందలించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన గణేష్ సోమవారం ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని మృతి చెందాడు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని రాజాం సీహెచ్‌సీకి తరిలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


