వంగర: మండల కేంద్రమైన వంగర గ్రామానికి చెందిన ఇనమల నరసమ్మ (48) పిడుగుపాటుతో మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. సహచర మహిళా కూలీలతో కలిసి నరసమ్మ వ్యవసాయ పనులకు సోమవారం ఉదయం వెళ్లింది. ఆ సమయంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అప్పటికే కూలీలు సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తుండగా.. ఒక్కసారిగా నరసమ్మపై పిడుగు పడింది. దీంతో మహిళా కూలీలు, రైతులు ఆమెను గ్రామంలోని పీహెచ్‌సీకి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో రాజాం సీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతురాలికి భర్త రాము, కొడుకు సన్యాసినాయుడు ఉన్నారు. నెల రోజుల కిందటే కుమారుడు సన్యాసినాయుడుకు వివాహం జరిగింది. ఇంతలో ఇలా జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఎస్సై షేక్ శంకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విజయరాంపురంలో ఎద్దు ..
తెర్లాం: మండలంలోని విజయరాంపురంలో పిడుగుపాటుకు ఓ ఎద్దు మృతి చెందింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కాబోతుల రాము అనే రైతు తన రెండు ఎద్దులను మేత కోసం సోమవారం సాయంత్రం పొలానికి తోలుకొని వెళ్లాడు. పొలంలో ఎద్దులు మేత మేస్తుండగా ఒక్కసారిగా పిడుగు పడింది. దీంతో ఒక ఎద్దు అక్కడికక్కడే మృతి చెందింది. బాధిత రైతును ఆదుకోవాలని మాజీ సర్పంచ్ బూరి మధుసూదనరావు కోరారు.


