● ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు
● వెదుళ్లపాలెం వద్ద ఘటన
● క్షతగాత్రులు విజయనగరం జిల్లా వాసులు
నక్కపల్లి: జాతీయరహదారిపై వెదుళ్లపాలెం జంక్షన్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో ఒక వ్యక్తి మరణించగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్‌ఐ సన్నిబాబు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం గింజేరి గ్రామానికి చెందిన సుమారు 10 మంది వ్యాన్‌లో ఒంగోలు వెళ్లారు. అక్కడ ఫంక్షన్ చూసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. వీరు ప్రయాణిస్తున్న వ్యాన్ అనకాపల్లి జిల్లా నక్కపల్లి సమీపంలో వెదుళ్లపాలెం జంక్షన్ వద్ద రోడ్డుపక్కన పార్క్‌చేసిన ఉన్న లారీని వెనుకనుంచి ఢీకొంది. ఈ ఘటనలో వ్యాన్‌లో డ్రైవర్ పక్కన కూర్చొన్న రాజాన రామ్మూర్తి(60) తీవ్రగాయాలతో అక్కడికక్కకడే మరణించాడు. వ్యాన్‌లో ఉన్న ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం కొట్టాంకు చెందిన దండుపాటి శాంతి, ఇదే మండలం చామలపల్లిగ్రామానికి చెందిన జుత్తాడ దేవి, కొత్తవలస మండలం ముమ్మలోడుపాలెంకు చెందిన మంతిన దుర్గమ్మ, చామలపల్లి గ్రామానికి చెందిన రాపర్తి రామలక్ష్మి, గింజేరి గ్రామానికి చెందిన నానిపల్లి లక్ష్మి ఉన్నారు. వీరికి నక్కపల్లి ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించి విశాఖ కేజీహెచ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఎమ్మెల్సీకి సత్కారం
రేగిడి: ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌ను శనివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు ఘనంగా సత్కరించారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి ఎమ్మెల్సీ ఎంతో సహకరించారని ఈ సందర్భంగా సర్పంచ్‌లు కొనియాడారు. కార్యక్రమంలో ఎంపీపీ దార అప్పలనర్సమ్మ, వైస్ ఎంపీపీలు టంకాల అచ్చెన్నాయుడు, వావిలపల్లి జగన్మోహనరావు, తదితరులు పాల్గొన్నారు.
కృత్రిమ మేధస్సుతో భవిష్యత్
● గూగుల్ సంస్థ మెషీన్ లెర్నింగ్ ఇంజినీర్ సౌమ్య
రాజాం సిటీ: కృత్రిమ మేధస్సు, మెషీన్ లెర్నింగ్ భవిష్యత్ ఉద్యోగాలపై ప్రభావం చూపుతాయని బెంగుళూరుకు చెందిన గూగుల్ సంస్థ మెషీన్ లెర్నింగ్ ఇంజినీర్–2 బి.సౌమ్య అన్నారు. జీఎంఆర్ ఐటీ డీమ్డ్ యూనివర్సిటీలో శనివారం నిర్వహించిన ప్లేస్‌మెంట్ సక్సెస్ డే కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ఏఐ ఉద్యోగాలను తగ్గించదని, వాటి స్వభావాన్ని మార్చుతూ కొత్త అవకాశాలను సృష్టిస్తుందన్నారు. విద్యార్థులు అవకాశాలను వినియోగించుకుని ఉద్యోగార్థులుగా కాకుండా క్రియేటర్స్‌గా రాణించాలని ఆకాంక్షించారు. యూనివర్సిటీ వీసీ డాక్టర్ జె.గిరీష్ మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రొగ్రామింగ్, డేటా స్ట్రక్చర్స్, గణితం వంటి మౌలిక అంశాలలో పట్టు సాధించాలన్నారు.
అలాగే సాంకేతిక నైపుణ్యాలతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, టీమ్ వర్క్ కూడా అవసరమేనని చెప్పారు. రిజిస్ట్రార్ డాక్టర్ ఎంవీ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని నైపుణ్య శిక్షణ కార్యక్రమాలపై దృష్టి సారిస్తామన్నారు. 1100 మందికి ఆఫర్లు రాగా 850 మంది వివిధ ఉద్యోగాల్లో నియమితులయ్యారని కెరీర్ డవలప్‌మెంట్ సెంటర్ సభ్యుడు కిరణ్‌కుమార్ వెల్లడించారు. కార్యక్రమంలో డాక్టర్ సీఎల్‌వీఆర్‌ఎస్‌వీ ప్రసాద్, డాక్టర్ ఏవీ రమణ, డాక్టర్ పి.రమణ, డాక్టర్ రవీంద్రనాథ్, డాక్టర్ శశికుమార్, డాక్టర్ గణేష్ ప్రభు, డాక్టర్ ఆర్‌ఎల్ నాయుడు, అధ్యాపకులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.


