జియ్యమ్మవలస రూరల్: రెవెన్యూ శాఖలో గ్రామస్థాయి వీఆర్‌ఓలు రైతుల పొలాలనే కాకుండా కులాలను కూడా ఇష్ట్టారాజ్యంగా మార్చేస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా ఇటీవల మండలంలోని చింతలబెలగాం పంచాయతీ సింగనాపురం గ్రామానికి చెందిన వాండ్రాసి అన్వేష్‌కు (తండ్రి గౌరు) మంజూరైన కులధ్రువీకరణ పత్రాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అన్వేష్ కులధ్రువీకరణ పత్రం కోసం సచివాలయానికి వెళితే బలిజ (బీసీ డీ) సర్టిఫికెట్ మంజూరైంది. కుల ధ్రువీకరణ పత్రం చూసిన అన్వేష్ ఒక్కసారి ఆశ్చర్యానికి లోనయ్యాడు. వాస్తవానికి అతడు రజక (బీసీ ఏ) కులానికి చెందిన వాడు. అలాగే తురకనాయుడువలస గ్రామానికి చెందిన 25 ఎర్ర గొల్లల కుటుంబాలకు వీఆర్‌ఓలు తప్పుడు కులధ్రువీకరణ పత్రాలు మంజూరు చేశారు. దీంతో వారంతా మూడేళ్లుగా కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. తమ కుటుంబాల్లో 25 మంది వరకు విద్యార్థులు ఉన్నారని.. వీరికి తమ కులానికి సంబంధించిన కులధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలని వారంతా కోరుతున్నారు. ఇదే విషయమై తహసీల్దార్ ఎం. అప్పారావు వద్ద ప్రస్తావించగా.. విచారణ చేపట్టి సరైన కులధ్రువీకరణ పత్రాలు మంజూరు చేస్తామన్నారు.


