విజయనగరం క్రైమ్: విజయనగరం టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గతేడాది నమోదైన హత్య కేసులో గాజులరేగకు చెందిన నిందితుడు కర్నపు సాయి(20)కి జీవిత ఖైదుతో పాటు రూ. 2 వేల జరిమాన విఽధిస్తూ విజయనగరం డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి ఎం.బబిత తీర్పు వెలువరించారని ఎస్పీ దామోదర్ తెలిపారు. సోమవారం ఆయన వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. గాజులరేగకు చెందిన సాయి తండ్రి లచ్చన్న వద్ద ఉంటున్నాడు. తండ్రి పేరున ఉన్న ఇంటిని తన పేరుపై రాయాలని కొన్నాళ్లుగా ఒత్తిడి తీసుకువస్తున్నాడు. అందుకు తండ్రి లచ్చన్న నిరాకరించడంతో కక్ష పెంచుకున్న సాయి 2025 ఫిబ్రవరి 13న రాత్రి ఇంటికి తాగి వచ్చి మంచంపై పడుకున్న తండ్రి గుండెలపై బలంగా గుద్ది చంపేశాడు. దీంతో మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి టూటౌన్ ఎస్సై మురలి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అనంతరం కేసు దర్యాప్తులో భాగంగా ప్రస్తుత సీఐ శ్రీనివాస్ హత్య కేసుగా నమోదు చేసి నిందితుడు సాయిని అరెస్టు చేసి కోర్టులో అభియోగ పత్రాలు దాఖలు చేశారు. సాయిపై నేరారోపణలు రుజువు కావడంతో జడ్జి జీవితఖైదు, జరిమాన విధిస్తూ తీర్ప చెప్పారు.
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
విజయనగరం క్రైమ్: విజయనగరం శివారు సారిపల్లి జంక్షన్ వద్ద సుమారు అరవై ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని టూటౌన్ పోలీసులు సోమవారం గుర్తించారు. కంట్రోల్ రూమ్ నుంచి సమాచారం అందుకున్న సీఐ శ్రీనివాసరావు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేంద్రాస్పత్రికి తరలించారు. మృతుడు చామన ఛాయ రంగులో ఉన్నాడని, గోధుమ రంగు షర్టు, నలుపు రంగు గళ్ల లుంగీ కట్టుకున్నాడదని సీఐ తెలిపారు. వివరాలు తెలిసిన వారు 91211 09420 నంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు.


