లక్ష్యం నెరవేరేవరకు ప్రకృతితో సాగుదాం | - | Sakshi
Sakshi News home page

లక్ష్యం నెరవేరేవరకు ప్రకృతితో సాగుదాం

Mar 31 2026 7:14 AM | Updated on Mar 31 2026 7:14 AM

విజయనగరం ఫోర్ట్‌:

పంటల సాగులో అధిక రసాయనిక ఎరువుల వినియోగం అనర్థదాయకం. భూమి నిస్సారమవుతుంది. చీడపీడల తాకిడి ఎక్కువగా ఉంటుంది. పెట్టుబడి పెరగడంతో పాటు రైతుకు నష్టం వాటిల్లుతుంది. అనారోగ్యకర ఉత్పత్తులే చేతికందుతాయి. వీటిని వినియోగించిన వారు వ్యాధుల బారిన పడతారు. అందుకే... ప్రకృతి సాగును వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు ప్రోత్సహిస్తున్నారు. ఆరోగ్యకర వ్యవసాయ ఉత్పత్తులను ఉత్పత్తిచేయడంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. చీడపీడల నివారణకు వినియోగించే కషాయాల తయారీపై శిక్షణ ఇస్తున్నారు. ఆరోగ్యకర సమాజనిర్మాణమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.

సాగు పద్ధతులపై అవగాహన

ప్రకృతి సాగులో భాగంగా పంటలు వేసే ముందు నవధాన్యాలైన మినుము, పెసలు, నువ్వులు, ఉలవలు, రాగి, బొబ్బర్లు, శనగలు, కందులు, కట్టెజనుమును ఒక్కొక్కటి కేజీ చొప్పన 9 కేజీలు ఎకరా విస్తీర్ణంలో సాగుచేయాలి. సుగంద ద్రవ్యాలైన మెంతులు, ఆవాలు, ధనియాలు 100 గ్రాములు, కూరగాయల విత్తనాలు, ఆకుకూర విత్తనాలైన తోటకూర, గోంగూర, ఆనప, బీర, విత్తనాలు 100 గ్రాములు చొప్పున వరి పంట సాగుకు 45 రోజుల ముందు పొలంలో చల్లాలి. విత్తనాలు చల్లిన 45 రోజులు తర్వాత పొలంలో కలియదున్నాలి. ఆ తర్వాత వరి పంట సాగుచేయాలి. ఎలాంటి ఎరువులు వేయకుండానే పంట ఏపుగా పెరిగి అధిక దిగుబడులు వస్తాయని ప్రకృతిసాగు విభాగం అధికారులు చెబుతున్నారు.

ఈ ఏడాది అధిక విస్తీర్ణంలో..

ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో ప్రకృతి సాగు పద్ధతిలో 1.03 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేయాలని లక్ష్యంగా వ్యవసాయ అధికారులు నిర్ణయించారు. దీనికోసం 93,595 మంది రైతులను గుర్తించి అవగాహన కల్పిస్తున్నారు. గతేడాది 67,467 ఎకరాల్లో ప్రకృతి సాగు పద్ధతిలో పంటలు సాగుచేశారు. గత ఏడాది కంటే ఈఏడాది 32,896 ఎకరాల్లో సాగు లక్ష్యాన్ని పెంచారు.

ప్రోత్సహిస్తున్నాం..

ప్రకృతి సాగుచేసే రైతులను ప్రోత్సహిస్తున్నాం. ఏటా జిల్లాలో సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ప్రస్తుత తరుణంలో ప్రకృతి పద్ధతిలో సాగు చేయడం ఉత్తమం. ఆరోగ్యకరమైన పంటలు వస్తాయి. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించవచ్చు.

– ఆనందరావు, మేనేజర్‌,

ప్రకృతి వ్యవసాయ విభాగం

రైతులు మొగ్గుచూపే పంటలివే..

ప్రకృతి సాగు పద్ధతిలో జిల్లా రైతులు వరి, మొక్కజొన్న, కూరగాయాల సాగుకు మొగ్గు చూపుతున్నారు. రసాయనిక ఎరువులు లేకుండా పండించడం వల్ల తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు వస్తున్నాయని రైతులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement