● సత్తా చాటిన కిల్లక లలిత, కరణం గౌతమ్
విజయనగరం: ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్ కళింగ స్టేడియం వేదికగా మార్చి 18 నుంచి 21 వరకు నిర్వహించిన 24వ జాతీయ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీల్లో జిల్లాకు చెందిన పారా క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరచి పతకాలు సాధించారు. దీంతో క్రీడాకారులను పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె. దయానంద్ అభినందించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ.. గుమ్మలక్ష్మీపురం మండలం గుల్లలంక గ్రామానికి చెందిన పరుగుల రాణి కిల్లక లలిత (టి –11 కేటగిరి) 400 మీటర్ల పరుగులో గోల్డ్ మెడల్, 1500 మీటర్ల పరుగులో బ్రాంజ్ మెడల్ సాధించిందన్నారు. అలాగే బొబ్బిలి మండలం ఎం.వలసకు చెందిన క్రీడాకారుడు కరణం గౌతమ్ (టి –12 కేటగిరి) లాంగ్‌జంప్‌లో బ్రాంజ్ మెడల్ గెలుచుకుని జాతీయ స్థాయిలో జిల్లా పేరు మారుమోగేలా చేశాడని కొనియాడారు. బలమైన సంకల్పం, నిరంతర సాధన ఉంటే అనుకున్నది సాధించేందుకు వైకల్యం ఏమాత్రం అడ్డుకాదని జిల్లాకు చెందిన పారా క్రీడాకారులు నిరూపిస్తున్నారన్నారు. విజేతలకు కలెక్టర్ రాంసుందరరెడ్డి, జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్. వెంకటేశ్వరరావు అభినందనలు తెలియజేశారు.


