అదే జనం.. అదే శోభ...
మక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ అమ్మవారి ఐదవ జాతర మంగళవారం వైభవంగా జరిగింది. తెల్లవారుజాము నుంచి భక్తులు శంబర గ్రామానికి చేరుకున్నారు. చీపురుపల్లి, రాజాం, జామి మండలాల్లోని అమ్మవారి జాతరలు జరుగుతున్న నేపథ్యంలో, పోలమాంబ అమ్మవారి ఐదవ జాతరకు భక్తులు రద్దీ తగ్గుతుందని అధికారులు భావించినప్పటికీ, అదే జనం, అదే శోభ కనిపించింది. చదురుగుడి, వనంగుడి క్యూల వద్ద భక్తులు బారులు తీరారు. చదురుగుడిలో కొలువైన పోలమాంబ అమ్మవారినీ భక్తులు దర్శించుకొని, అనంతరం వనంగుడిలో పోలమాంబ అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. అధిక సంఖ్యలో అమ్మ దర్శనానికి చేరుకోవడంతో క్యూలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. గోముఖి నది ఒడ్డున కోళ్లు, మేకలు, తలనీలాలు సమర్పించి భక్తులు మొక్కుబడులు చెల్లించుకున్నారు. వనంగుడి వెనుకున్న వేపచెట్టుకు మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా సీఐ రామకష్ణ, ఈఓ బి.శ్రీనివాసరావు, ట్రస్ట్ బోర్డ్ సభ్యులు చర్యలు చేపట్టారు.
అదే జనం.. అదే శోభ...


