సంతకవిటి: మండలంలోని పుల్లిట గ్రామానికి చెందిన పిన్నింటి స్వప్న మామిడితోటలో చెట్ల నరికివేతపై చీపురుపల్లి డీఎస్పీ ఎస్. రాఘవులు శుక్రవారం దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు డీఎస్పీ,తదితరులు తోటను పరిశీలించి, చెట్ల నరికివేతపై ఆరా తీశారు. ఆయనతో పాటు రాజాం టౌన్ సీఐ, ఎస్సై ఆర్.గోపాలరావు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.
క్లూస్‌టీమ్ పరిశీలన
సీతంపేట: మండల పరిధిలోని వేంకటేశ్వర ఆలయం పక్కన జల్‌జీవన్ మిషన్ పైపులు గురువారం దగ్ధం కావడంతో క్లూస్ టీమ్ సభ్యులు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారని ఎస్సై వై.అమ్మన్నరావు తెలిపారు.
పిచ్చికుక్క స్వైర విహారం
● ముగ్గురికి గాయాలు
పార్వతీపురం రూరల్: గరుగుబిల్లి మండలంలోని నాగురు గ్రామంలో శుక్రవారం ఓ పిచ్చికుక్క స్వైరవిహారం చేసి ముగ్గురిని గాయపరిచింది. గుడ్‌ఫ్రైడే ప్రార్థనల నేపథ్యంలో తల్లిదండ్రులతో కలిసి స్థానిక చర్చికి వచ్చిన రెండేళ్ల మండంగి లిఖిత అనే చిన్నారి బయట ఆడుకుంటుండగా, కుక్క ఒక్కసారిగా ఆమె తలపై తీవ్రంగా గాయపరిచింది. చిన్నారిని కాపాడే ప్రయత్నంలో చింతల అప్పలనాయుడు, అక్కేన చంద్రశేఖర నాయుడు (చినబాబు) కూడా కుక్క కాటుకు బలయ్యారు. అనంతరం వీధుల్లోకి పరుగు తీసిన ఆ శునకం అక్కేన సింహచలం సహా మరొకరికి చెందిన దూడలను గాయపరిచింది. క్షతగాత్రులు జిల్లా కేంద్రాస్పత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
50 కిలోల గంజాయితో ముగ్గురి అరెస్ట్
లక్కవరపుకోట: అరకు – విశాఖ జాతీయ రహదారిపై రంగరాయపురం జంక్షన్ సమీపంలో కారులో గంజాయి తరలిస్తున్న ముగ్గురిని శుక్రవారం అదుపులోకి తీసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపారు. స్థానికులు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలియజేసిన వివరాల మేరకు.. ఒడిశా ప్రాంతానికి చెందిన ఇద్దరు.. అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన ఒకరు 50 కిలోల గంజాయిని తరలిస్తున్నారు. ఒకరు ద్విచక్ర వాహనంపై ముందు వెళ్తుండగా.. కారులో ఉన్న వారు గంజాయితో వెనుక వెళ్తున్నారు. అయితే టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగరాయపురం జంక్షన్ వద్ద తనిఖీలు చేపట్టి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని.. కారు, ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు. గంజాయిని ఎక్కడ నుంచి తీసుకువస్తున్నారు.. ఎక్కడకు తరలిస్తున్నారు..అన్న అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
మోసగాడి అరెస్ట్
విజయనగరం క్రైమ్: ఆన్‌లైన్ ద్వారా మోసాలకు పాల్పడే వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించినట్లు ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. విజయనగరం ఉడా కాలనీకి చెందిన దాసరి ఉత్తేజ్ ఆర్‌సీ 200 మోడల్ ద్విచక్ర వాహనాన్ని ఓఎల్‌ఎక్స్‌లో చూసి గుర్తు తెలియని వ్యక్తి ఖాతాలో రూ. 60 వేలు జమ చేసి మోసపోయాడని తెలిపారు. అలాగే పార్వతీపురం మన్యం జిల్లా గురుగుబిల్లి మండలం రావుపల్లికి చెందిన సాయిరామ్ అనే వ్యక్తి కూడా ఓఎల్‌ఎక్స్‌లో పల్సర్ 150 సీసీ వాహనాన్ని చూసి గుర్తు తెలియని వ్యక్తికి రూ. 75 వేలు పంపించి మోసపోయాడని చెప్పారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సాంకేతిక ఆధారాలతో నిందితుడు చల్లా శంకర్‌ను వన్‌టౌన్ సీఐ ఆర్‌వీఆర్‌కే చౌదరి అరెస్ట్ చేశారన్నారు. తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం సీవీ కండ్రిగకు చెందిన నిందితుడిపై ఇప్పటికే తిరుపతి జిల్లా వెంకటగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒక హత్య.. కృష్ణా జిల్లా పెనములూరు పీఎస్ పరిధిలో ఇంటి దొంగతనం కేసు నమోదైందని తెలిపారు.


