బొబ్బిలి: సామ్రాజ్యవాద దురహంకారంతోనే ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు దాడు లు చేస్తున్నాయని, ఈ ప్రభావం భారత దేశంపై పడుతున్న భారాలు చాలా దారుణంగా ఉన్నాయని గురజాడ అధ్యయన వేదిక కన్వీనర్, యూటీఎఫ్ రాష్ట్ర నాయకురాలు కె.విజయగౌరి అన్నారు. ప్రజలకు ఈ విషయమమై అవగాహన కల్పించేందుకు ఈ నెల 12న నిర్వహించనున్న సెమినార్‌కు సంబంధించిన కరపత్రాలను శుక్రవారం సాయంత్రం స్థానిక తాండ్రపాపారాయ ప్రాథమిక పాఠశాల ఆవరణలో విడుదల చేశారు. సెమినార్‌కు ఉద్యోగ, ఉపాధ్యాయులు హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో అధ్యయన వేదిక ప్రతినిధులు పాల్గొన్నారు.
విపత్తులపై అవగాహనే ప్రధానం
డెంకాడ: విపత్తుల సమయాల్లో తీసుకోవాల్సిన చర్యలపై అవగాహనతో ప్రమాద తీవ్రతను తగ్గించవచ్చని విపత్తు నిర్వహణ 5వ ఏపీఎస్పీ బెటాలియన్ విపత్తు ప్రతిస్పందన దళం ఇన్‌స్పెక్టర్ ఎస్.చంద్రశేఖర్ అన్నారు. చింతలవలస ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడుకునే పద్ధతులను చంద్రశేఖర్ వివరించారు. 25 మంది దళం సభ్యులు తుఫాన్, వరదలు వంటి విపత్తు సమయాల్లో ఉపయోగించే వివిధ పరికరాలు, పద్ధతులను ప్రయోగాత్మకంగా వివరించారు. నదులు, సముద్రాల్లో చిక్కుకునేవారిని రక్షించే పద్ధతులను తెలియజేశారు. ఉరుములు, మెరుపులు, అగ్నిప్రమాదాలు, భూకంపాలు, రైలు ప్రమాదాల సమయాల్లో భద్రతా చర్యలను వివరించారు. కార్యక్రమంలో ఆర్‌ఎస్‌లు జి.శివప్రసాద్, కె.భాస్కరరావు, ఎన్‌ఎస్‌ఎస్ పీఓ ఎన్.షణ్ముఖరావు, జి.ఆంజనేయులు, వలంటీర్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
20న శిలాస్థాపన
పార్వతీపురం రూరల్: లోక కల్యాణార్థం పార్వతీపురంలో నిర్మించనున్న ‘శ్రీరామకోటి స్తూప’ నిర్మాణ పనులు ఆధ్యాత్మిక వాతావరణంలో ఊపందుకున్నాయి. శ్రీ విద్యా సర్వమంగళ పీఠం ఆధ్వర్యంలో శ్రీరామ శిలాయాత్ర భక్తిప్రపత్తులతో కొనసాగుతోంది. స్థానిక దుర్గ చెట్టు ప్రాంగణంలో నిర్మించనున్న ఈ స్తూపానికి సంబంధించిన శిలకు సూర్యపీఠంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పీఠం నిర్వాహకుడు బ్రహ్మశ్రీ వేమకోటి నరహరి శాస్త్రి, కాళిదాసు శర్మ మాట్లాడుతూ.. ఈ పవిత్ర శిలకు ఈనెల 5వ తేదీ నుంచి 7 వరకు శ్రీశైల క్షేత్రంలో ఉంచి పూజలు నిర్వహించనున్నట్లు చెప్పారు. వివిధ పుణ్యక్షేత్రాల్లో పూజలు చేసిన అనంతరం ఏప్రిల్ 20న ఉదయం 10:56 గంటలకు మిథున లగ్నంలో శిలాస్థాపన మహోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు.


