సాయం చేద్దామని వెళ్తే.. శవమైపోయింది..
● సిలిండర్ పేలి గృహిణి దుర్మరణం
విజయనగరం క్రైమ్: నగరంలోని హుకుంపేట సాయిబుల వీధిలో ఓ ఇంట్లో మంగళవారం మధ్యాహ్నం సిలిండర్ పేలి గృహిణి దుర్మరణం పాలైంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు.. హుకుంపేటలోని సాయిబుల వీధిలో దోనేపూడి భవాని తన భర్త, ఇద్దరు మగ పిల్లలతో కొన్నాళ్లుగా నివాసం ఉంటుంది. భర్త కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భవాని ఇరుగుపొరుగు వారితో కలివిడిగా ఉంటూ పనుల్లో సాయం చేస్తూ ఉండేది. ఈ క్రమంలో పక్కింటి మహిళ సిలిండర్ పెట్టుకోవడంలో ఇబ్బందులు పడుతుంటే చూసి పిన్ని నేనే సాయం చేస్తానంటూ మధ్యాహ్నం రెండు గంటల సమయంలో వెళ్లింది. సిలిండర్ అమర్చింది. ఇంతలో భవానీకి పొయ్యిపై ఎసరు పెట్టమని చెప్పింది. ఆ సమయంలో అగ్గిపుల్లతో గ్యాస్ పొయ్యి వెలిగిస్తున్న క్రమంలో సిలిండర్ సరిగా అమర్చకపోవడం వల్ల గ్యాస్ లీకై ఒక్కసారిగా పేలింది. దీంతో భవాని అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. చుట్టుపక్కల వారు గ్యాస్ సిలిండర్ పేలుడు శబ్ధం విని భయభ్రాంతులకు గురై వెంటనే అగ్నిమాపక శాఖాధికారులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే ఇల్లు మొత్తం దగ్ధమైంది. సమాచారం అందుకున్న టుటౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. భవానీ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


