తండ్రి మందలించాడని.. తనయుడు ఆత్మహత్య
కురుపాం: మండలంలోని తోటగూడ గ్రామానికి చెందిన ఓ యువకుడు తండ్రి మందలించాడని ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. కురుపాం ఎస్‌ఐ పి.నారాయణరావు తెలిపిన వివరాలు.. రస్తాకుంటుబాయి పంచాయతీ తోటగూడ గిరిజన గ్రామానికి చెందిన ఆరిక లక్ష్మణరావు(26) చెడు వ్యసనాలకు బానిసై రోజూ జీలుగు కల్లు సేవించి ఇంటికి వస్తుండడంతో తండ్రి ఆరిక పొట్టన్న రెండు రోజుల కిందట మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన లక్ష్మణరావు ఈ నెల 22న ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా గమనించిన కుటుంబ సభ్యులు కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. మెరుగైన వైద్య సేవల కోసం పార్వతీపురం అక్కడ నుంచి విజయనగరం మహారాజ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడని ఎస్‌ఐ తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన చెప్పారు.


