ఆపర్చ్యూనిటీస్ పోర్టల్ ప్రారంభం
విజయనగరం రూరల్: విద్యార్థులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు సమృద్ధిగా లబించడానికి నిర్మాణ్ ఆర్గనైజేషన్, జేఎన్‌టీయూ జీవీ సంయుక్త ఆధ్వర్యంలో ‘ఆపర్చ్యూనిటీస్ పోర్టల్‌ను’ జేఎన్‌టీయూ జీవీ ఉపకులపతి వి.వి.సుబ్బారావు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ నెలా ధృవీకరించబడిన ఉపాధి అవకాశాలను గుర్తించడానికి, నిర్వహించడానికి, సమాచారం అందించడానికి ఈ పోర్టల్ కేంద్రీకృత వేదికగా పని చేస్తుందని తెలిపారు. ఈ పోర్టల్‌లో నియామక ప్రక్రియ, పర్యవేక్షణకు డైనమిక్ రిజిస్ట్రేషన్ డేటాబేస్‌ను నిర్వహిస్తుందన్నారు. ఉద్యోగ అవకాశాలతో పాటు, పరిశ్రమ డిమాండ్లకు అనుగుణంగా నైపుణ్య అభివృద్ధి కోర్సులను ప్రకటించడం జరుగుతుందన్నారు. ఈ ఆపర్చ్యూనిటీ పోర్టల్ ఎంబీఏ, ఎంసీఏ, ఎం.ఫార్మా, బీటెక్, బీఫార్మా, బీఎస్సీ, బీకాం, బీబీఏ, బీబీఎం, ఐటీఐ అభ్యర్థుల ఉద్యోగ అవకాశాలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అనంతరం పోర్టల్ వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో నిర్మాణ్ ఆర్గనైజేషన్ సీఈఓ మయూర్ పట్నాల, జేఎన్‌టీయూ అధికారులు, డైరెక్టర్లు, ఆచార్యులు, నిర్మాణ్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
అవగాహన ఒప్పందం
జేఎన్‌టీయూ జీవీ, విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాలల మధ్య విద్య, పరిశోధనపై పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి అవగాహన ఒప్పందం (ఎంఓయూ) మంగళవారం కుదిరింది. దీనికి సంబంధించి జేఎన్‌టీయూ జీవీ ఉపకులపతి వి.వి.సుబ్బారావు, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్, అదనపు వైద్య విద్య సంచాలకులు డాక్టర్ బి.దేవిమాధవీలు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంతో ఫార్మశీ, వైద్య రంగాల్లో విద్యార్థులకు ప్రాయోగిక శిక్షణ, సంయుక్త పరిశోధన కార్యక్రమాలు, శాసీ్త్రయ సదస్సులు, శిక్షణా శిబిరాలు నిర్వహించేందుకు అవకాశం కలుగుతుందని వీసీ తెలిపారు. ఆధునిక వైద్య సేవలు, ఔషధ పరిశోధన, క్లినికల్ ప్రాక్టీస్ రంగాల్లో పరస్పర సహకారం మరింత బలపడుతుందని అధికారులు తెలిపారు. ఈ ఒప్పందంతో జిల్లాలో ఉన్నత విద్య, వైద్య రంగాల అభివృద్ధికి దోహదపడుతూ, విద్యార్థులకు మెరుగైన విద్య, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. కార్యక్రమంలో ఇరు సంస్థల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


