ఘోషా ఆస్పత్రికి అడ్వాన్స్‌డ్ త్రీ ఇన్‌వన్ మిషన్
విజయనగరం ఫోర్ట్: ఘోషా ఆస్పత్రికి ‘డాక్టర్ ఫర్ యు’ అనే స్వచ్ఛంద సంస్థ అందించిన అడ్వాన్స్‌డ్ త్రీఇన్‌వన్ మిషన్‌ను ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ త్రీ ఇన్ వన్ మిషన్‌తో రోగికి అవసరమైన ఆక్సిజన్, గాలిని కచ్చితమైన పరిమాణంతో అందించవచ్చన్నారు. వాతావరణంలో ఉండే గాలిని, సిలిండర్ లేదా సెంట్రల్ లైన్ నుంచి వచ్చే ఆక్సిజన్‌ను ఒకచోట కలిపి, డాక్టర్ సూచించిన మేర ఆక్సిజన్ అందించేందుకు ఈ మిషన్ ఉపకరిస్తుందని తెలిపారు. చిన్న పిల్లలకు, అత్యవసర చికిత్సలో ఉన్నవారికి చాలా తక్కువ స్థాయిలో కచ్చితమైన ఆక్సిజన్ అవసరమైనప్పుడు ఈ మిషన్‌ను ఉపయోగిస్తారని చెప్పారు. కార్యక్రమంలో వైద్యులు శ్రీరామ్ సుబ్రహ్మణ్యం, దీపక్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
మేకలను ఎత్తుకెళ్లిన దొంగలు
బొబ్బిలి రూరల్: మండలంలోని కింతలివానిపేట గ్రామానికి చెందిన చిప్పాడ కుమారమ్మకు చెందిన ఐదు మేకలను సోమవారం రాత్రి దొంగలు ఎత్తుకెళ్లారు. మంగళవారం తెల్లవారి గ్రామ పొలిమేరలో ఉన్న తమ కల్లంలో చూసే సరికి మేకల శాలలో మేకలు లేవని బాధితురాలు తెలియజేస్తూ కన్నీరు పెట్టుకుంది. నాలుగు రోజుల కిందట మానాపురం సంతలో 50 వేల రూపాయిలతో ఐదు మేకలను కొనుగోలు చేశామని, పెంచి పెద్ద చేసిన అనంతరం వాటిని విక్రయించాలన్న ఆలోచనలో ఉండగా ఇంతలో దొంగలు తమ మేకల శాలలో పడి తాళాలు పగుల గొట్టి మేకలను ఎత్తుకెళ్లారని వాపోయింది. మేకలను పిల్లల దశలో తెచ్చి వాటిని పెంచి పెద్ద చేసి వాటిని విక్రయించడం ద్వారా తమకు ఆదాయం వస్తుందని అదే తమ జీవనాధారమని ఆవేదన వ్యక్తం చేసింది. దొంగిలించిన మేకల కొనుగోలుకు అప్పు చేశామని, ఇంతలో దొంగలు తమ మేకలను ఎత్తుకెళ్లారని వాపోయింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపింది. దీనిపై సీఐ నారాయణరావును సంప్రదించగా తమకు ఫిర్యాదు అందలేదని తెలిపారు.


