కొత్తవలస తహసీల్దార్‌గా రామలక్ష్మి | - | Sakshi
Sakshi News home page

కొత్తవలస తహసీల్దార్‌గా రామలక్ష్మి

Feb 24 2026 9:04 AM | Updated on Feb 24 2026 9:04 AM

కొత్త

కొత్తవలస తహసీల్దార్‌గా రామలక్ష్మి

విజయనగరం కలెక్టరేట్‌: కొత్తవలస మండల తహసీల్దార్‌గా ఎస్‌.రామలక్ష్మిని నియమిస్తూ కలెక్టర్‌ ఎస్‌.రాంసందర్‌ రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈమె విజయవాడ భూ పరిపాలన ముఖ్య కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) కార్యాలయంలో సెక్షన్‌ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నారు. సర్వీసు నిబంధనల్లో భాగంగా రెండేళ్లపాటు తహసీల్దార్‌గా కొనసాగనున్నారు.

25, 26న రాష్ట్రస్థాయి పారా బ్యాడ్మింటన్‌ పోటీలు

పోస్టర్లు విడుదల చేసిన ఏఎస్పీ సౌమ్యలత

విజయనగరం: పారా స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 25, 26 తేదీల్లో విజయనగరం రాజీవ్‌ ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించే 7వ పారా బ్యాడ్మింటన్‌ రాష్ట్రస్థాయి పోటీలను విజయవంతం చేయాలని ఏఎస్పీ సౌమ్యలత ఆకాంక్షించారు. ఈ మేరకు అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్స్‌ను ఆమె తన కార్యాలయంలో సోమవారం ఆవిష్కరించారు. అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి వి.రామస్వామి, జిల్లా గౌరవాధ్యక్షుడు కె.దయానంద్‌ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి పారా బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు ఈ పోటీలకు హాజరు కానున్నారని, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటిన క్రీడాకారులు మార్చి 6 నుంచి 10వ తేదీ వరకు రంగారెడ్డి జిల్లాలో జరుగబోయే పారా బాడ్మింటన్‌ జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐ లీలారావు, అసోసియేషన్‌ జాయింట్‌ సెక్రటరీ కె.లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన

చీపురుపల్లి: మండలంలోని రావివలస పంచాయతీ పరిధిలోని పైలపేట గ్రామాన్ని కలెక్టర్‌ రాంసుందర్‌రెడ్డి సోమవారం పరిశీలించారు. ఈ నెల 28న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేపథ్యంలో జేసీ సేతుమాధవన్‌తో కలిసి రావివలస, పైలపేట గ్రామాలను సందర్శించారు. హెలిప్యాడ్‌, కార్యకర్తల సమావేశం, బహిరంగ సభ ప్రదేశాలు పరిశీలించారు. పింఛన్ల పంపిణీలో పాల్గొని లబ్ధిదారులతో సీఎం మాట్లాడనున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 19న సీఎం పర్యటన ఉంటుందని అధికారులు హడావిడి చేసినప్పటికీ రద్దయ్యింది.

ప్రై‘వేటు’ దిశగా ఆర్టీసీ..!

విజయనగరం అర్బన్‌: ఏపీఎస్‌ ఆర్టీసీని కార్పొరేట్లకు కట్టబెట్టే కుట్రలో కూటమి ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. రాష్ట్రంలోని 12 డిపోల్లో ఎలక్ట్రిక్‌ బస్సుల నిర్వహణను పినాకిల్‌ అనే ప్రైవేటు సంస్థకు అప్పగించాలని ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. వీటిలో విజయనగరం జోన్‌ పరిధిలోని మూడు డిపోలు ఉన్నా యి. వాటిలో శ్రీకాకుళంలోని శ్రీకాకుళం–1, శ్రీకాకుళం–2 డిపోలలో ఒకటి, విశాఖపట్టణంలో జిల్లాలోని స్టీల్‌ సిటీ డిపో, అనకాపల్లి డిపోలు ఉన్నాయి. మొత్తం 12 డిపోల్లో తొలివిడతగా 4 డిపోల్లో ప్రస్తుతం ఉన్న షెడ్యూల్స్‌ను సవరించింది. అక్కడి సిబ్బందిని బలవంతంగా ఇతర డిపోలకు బదిలీచేసి పూర్తి స్థాయిలో ప్రైవేటు వారికి అప్పగించే ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రభుత్వ చర్యతో ఆర్టీసీకి చెందిన స్థలాలు కూడా ప్రైవేటు వ్యక్తులు చేతుల్లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని కార్మిక సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆర్టీసీని బలోపేతం చేసి ఉద్యోగులకు ఉద్యోగభద్రత కల్పిస్తే.. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం ఒక్కో డిపోను ప్రైవేటువ్యక్తుల చేతుల్లో పెడుతోందని ఆరోపిస్తున్నాయి. ఇది వేలాది ఉద్యోగుల ఉపాధి, రాష్ట్రప్రజల ప్రయాణ సౌకర్యాలను దెబ్బతీసే ప్రమాదకర చర్య అని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నా యి. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం అనివార్యమవుతుందని సంకేతాలు ఇస్తున్నాయి. సంస్థ నిర్ణయాన్ని ఏపీపీటీడీ నేషనల్‌ మజ్దూర్‌ యూనిటీ అసోసియేషన్‌ వ్యతిరేకిస్తున్నట్టు ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు వై.శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షుడు పీజీరాఫెల్‌ తెలిపారు.

నేడు డిపోల ఎదుట నిరసన

డిపోల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జిల్లాలోని అన్ని డిపోల ఎదుట మంగళవారం నిరసన చేపడుతున్నామని ఎన్‌ఎంయూ జిల్లా అధ్యక్షుడు పీజీరాఫిల్‌ తెలిపారు. భోజన విరామ సమయంలో నిరసన తెలపాలన్నారు.

కొత్తవలస తహసీల్దార్‌గా రామలక్ష్మి 1
1/1

కొత్తవలస తహసీల్దార్‌గా రామలక్ష్మి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement