విద్యార్థులైనా ఉపేక్షించేది లేదు
గంజాయి సేవించిన విద్యార్థులను వారి భవిష్యత్తు పోతుందని ఇన్నాళ్లూ కేసులు నమోదు చేయకుండా కౌన్సెలింగ్ ఇచ్చి ఉపేక్షించాం. ఇక ఆ ప్రసక్తే లేదు. నేరుగా కేసులు బనాయిస్తాం. ప్రతీవారం ఏదో ఒక ప్రాంతంలో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తాం. డ్రగ్స్‌రహిత బొబ్బిలే లక్ష్యంగా పనిచేస్తాం.
– కె.నారాయణరావు, సీఐ, బొబ్బిలి
బొబ్బిలి:
బొబ్బిలి నియోజకవర్గంలో గంజాయి వాసనలు గుప్పుమంటోంది. చరిత్రకు, ప్రశాంతతకు, చక్కని చదువులకు నిలయమైన బొబ్బిలి... ఇటీవల కాలంలో గంజాయి వినియోగం, అమ్మకాల కేంద్రంగా మారింది. ఇది సామాన్యులను కలవరపెడుతోంది. రాజుల పాలనలో గంజాయి రాజ్యం రాజ్యమేలుతోందన్న అపవాదు ఉంది. విచ్చలవిడిగా, విద్యాసంస్థలకు సమీపంలో గంజాయి అమ్మకాలు విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
గంజాయి అమ్మకం, సేవించడంలో మైనర్లు సైతం ఉండడం పోలీస్ వర్గాలను సైతం విస్మయపరుస్తోంది. గంజాయి మత్తులో యువత చేస్తున్న వికృతచేష్టలు, దొంగతనాలు, లైంగిక వేధింపులు పోలీస్‌లకు సవాల్ విసురుతున్నాయి. పాలకుల అసమర్థతను ఎత్తిచూపుతున్నాయి. అర్థరాత్రి వేళ మహిళలు ఒంటరిగా రోడ్డుపై నడచివెళ్లే రోజులు రావాలని మహాత్మా గాంధీ కలలుగన్న చోట పట్టపగలు కూడా వెళ్లలేని పరిస్థితులు దాపురించడం సభ్యసమాజాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. బొబ్బిలి ప్రాంత తల్లిదండ్రులు, ప్రజలను భయంకంపితులను చేస్తోంది. ఇటీవల కాలంలో గంజాయి, మద్యం వినియోగం ఎక్కువైంది. బెల్టు షాపులు విచ్చలవిడిగా ఏర్పాటుకావడంతో మద్యం ఏరులై పారుతోంది. యువత చెడువ్యసనాలకు అలవాటుపడుతున్నా నియంత్రించే చర్యలు కనిపించడంలేదన్న వాదన బొబ్బిలితో పాటు జిల్లా ప్రజల నుంచి వినిపిస్తోంది. వరుస ఘటనలతో బొబ్బిలి లో పోలీసులు నిఘా పెంచారు.
ఎందులో నైపుణ్యం...!
బొబ్బిలి నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, మున్సిపాలిటీలో యువత, నిరుద్యోగులు, విద్యార్థుల కోసం నైపుణ్య శిక్షణా కేంద్రాలు తెరుస్తానని ఎమ్మెల్యే బేబీనాయన తన ఎన్నికల ప్రచారంలో ఊదర గొట్టారు. 20 నెలల పాలనలో నైపుణ్య శిక్షణ కేంద్రాల మాటే మరిచిపోయారు. కనీసం విద్యార్థులు, యువతను సన్మార్గంలో నడిపించే మార్గాలు, యువతకు ఉద్యోగకల్పన దారులు చూపకపోవడంపై నియోజకవర్గ ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
విద్యార్థులైనా ఉపేక్షించేది లేదు


