27 నుంచి అపరాలు కొనుగోలు
విజయనగరం ఫోర్ట్: అపరాలు (పెసర, మినుము) పంటను రైతులు విక్రయించేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక పోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. దళారులకు విక్రయించి క్వింటా పెసలు వద్ద రూ.1800, మినుములకు రూ.1000 వరకు నష్టపోతున్నారు. ఇదే అంశంపై ఈ నెల 17న ‘అపరాల రైతుకు కొనుగోలు గండం..! అనే శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఈ నెల 27న జిల్లాలో అపరాలు కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ తెలిపారు. తన చాంబర్‌లో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో జామి, సంతకవిటి, బొబ్బిలి మండలాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని చెప్పారు. రైతుల అవసరాలను బట్టి కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. పెసలు క్వింటాకు మద్దతుధర రూ.8,768, మినుములు క్వింటా మద్దతు ధర రూ. 7,400 ప్రకారం కొనుగోలుచేస్తామన్నారు. సమావేశంలో మార్క్‌ఫెడ్ డీఎం ఎన్.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
27 నుంచి అపరాలు కొనుగోలు
27 నుంచి అపరాలు కొనుగోలు


