టాటూ శివ ‘ఖూనీ’ స్కెచ్‌ | - | Sakshi
Sakshi News home page

టాటూ శివ ‘ఖూనీ’ స్కెచ్‌

Feb 24 2026 9:04 AM | Updated on Feb 24 2026 9:04 AM

టాటూ

టాటూ శివ ‘ఖూనీ’ స్కెచ్‌

15 ఏళ్ల స్నేహం.. రూ.5 లక్షల కోసం అంతం

‘రాంగ్‌ కాల్‌’తో పరిచయమైన లక్ష్మి

వీడిన ఆరిలోవ మహిళ హత్య కేసు మిస్టరీ

ఆరిలోవ (విశాఖ): ఆరిలోవలో సంచలనం సృష్టించిన కాపు లక్ష్మి హత్య కేసు మలుపులు, పోలీసుల ఛేదన తీరు క్రైమ్‌ సినిమాను తలపిస్తోంది. పదిహేనేళ్ల నాటి ఒక ‘రాంగ్‌ కాల్‌’ పరిచయం, చివరకు ఒక ప్రాణాన్ని బలితీసుకోవడం సమాజంలోని వక్రబుద్ధులకు అద్దం పడుతోంది. ఈ విషాదకర ఘటన వెనుక ఉన్న పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఆరిలోవ పరిధిలోని దుర్గానగర్‌లో ఈ నెల 11న జరిగిన కాపు లక్ష్మి (48) హత్య ఉదంతం నగరవాసులను ఉలిక్కిపడేలా చేసింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను దారుణంగా హతమార్చి నగదు, బంగారంతో పరారైన నిందితుడిని పట్టుకోవడం పోలీసులకు సవాల్‌గా మారింది. నగర క్రైమ్‌ డీసీపీ కె.లతామాధురి పర్యవేక్షణలో 10 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి, సాంకేతిక పరిజ్ఞానాన్ని, సీసీ కెమెరాల ఫుటేజీ సహాయంతో నిందితుడ్ని పట్టుకున్నారు. సోమవారం మీడియా సమావేశంలో వెల్లడైన వివరాల ప్రకారం.. ఈ ఘాతుకానికి పాల్పడిన విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన వంజరాపు శివ గంగరాజు అలియాస్‌ టాటూ శివను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

అప్పులు..క్రికెట్‌ బెట్టింగ్‌

నిందితుడు శివ బొబ్బిలిలో సెల్ఫోన్‌ షాపు నడుపుతూనే టాటూలు వేసేవాడు. అయితే క్రికెట్‌ బెట్టింగ్‌లు, జూదానికి అలవాటు పడి ఏకంగా కోటి రూపాయలు పోగొట్టుకున్నాడు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన అతనికి మరో 25 లక్షల రూపాయల అప్పులున్నాయి. ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు అతను పాత పరిచయాలను ఆయుధంగా మార్చుకున్నాడు. సుమారు 15 ఏళ్ల క్రితం ఒక రాంగ్‌ కాల్‌ ద్వారా పరిచయమైన కాపు లక్ష్మితో ఇన్నేళ్లుగా స్నేహం కొనసాగిస్తూ నమ్మకాన్ని పెంచుకున్నాడు. లక్ష్మి వద్ద చిట్టీల డబ్బు ఉంటుందని గ్రహించిన శివ, పథకం ప్రకారమే హత్యకు సిద్ధమై ఆమె ఇంటికి వెళ్లాడు.

పథకం ప్రకారం..

హత్య జరిగిన రోజున.. శివ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాడు. తన సొంత ఫోన్‌ వాడకుండా, బయట వ్యక్తి ఫోన్‌ నుంచి లక్ష్మికి కాల్‌ చేసి ఆమె ఒంటరిగా ఉన్న విషయాన్ని ధ్రువీకరించుకున్నాడు. ఇంటికి వెళ్లాక పెద్ద మొత్తంలో అప్పు అడగ్గా ఆమె నిరాకరించింది. అదే సమయంలో చిట్టీల ద్వారా వసూలైన రూ. 5 లక్షల నగదు కంటపడటంతో అతనిలో క్రూరత్వం నిద్రలేచింది. ముందుగా వేసుకున్న ప్రణాళికను అమలు చేస్తూ ఆమెను హత్య చేసి, ఇంట్లోని నగదుతో పాటు ఆమె ధరించిన బంగారు ఆభరణాలను దోచుకున్నాడు. ఏకంగా రెండున్నర గంటల పాటు ఆ ఇంట్లోనే ఉండి సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేసి, ఆపై ఆటోలు మారుస్తూ పరారయ్యాడు.

కాశీ నుంచి ఢిల్లీ వరకూ పోలీసుల వేట

దోచుకున్న సొమ్ముతో నిందితుడు దేశమంతా చక్కర్లు కొట్టాడు. విశాఖలో తాకట్టు పెట్టిన తన బైక్‌ను విడిపించుకుని బొబ్బిలికి వెళ్లాడు. అక్కడి నుంచి పోలీసుల కళ్లు గప్పేందుకు ఉత్తర భారతదేశంలోని ధన్‌బాద్‌, కాశీ, ఢిల్లీ, రాయగడ వంటి ప్రాంతాల్లో తలదాచుకున్నాడు. చివరకు ఈ నెల 22న రాత్రి విశాఖ రైల్వే స్టేషన్‌లో అడుగుపెట్టగానే నిఘా పెట్టిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రూ. 5.05 లక్షల నగదుతో పాటు, బంగారు గొలుసు, పుస్తుల తాడు, నల్లపూసలు, ఉంగరాలు తదితర ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన ఏసీపీ నర్సింహమూర్తి, సీఐ చక్రధరరావు బృందాన్ని డీసీపీ లతామాధురి అభినందించారు.

టాటూ శివ ‘ఖూనీ’ స్కెచ్‌1
1/1

టాటూ శివ ‘ఖూనీ’ స్కెచ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement