గడువులోగా వినతులు పరిష్కరించాలి
విజయనగరం కలెక్టరేట్: పీజీఆర్‌ఎస్ వినతులను గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ ఎం. రాంసుందర్‌రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. ఆడిట్ రిపోర్టులు పెండింగ్ లేకుండా చర్యలు చేపట్టాలని, ఏకకృత కుటుంబ సర్వే వేగవంతం చేయాలని, అన్న క్యాంటీన్‌లలో ఆహార నాణ్యత పెంచాలని అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్, ఈపీటీఎస్, ఇంటర్ డిపార్ట్‌మెంట్‌లలో పలు అంశాలపై జిల్లా అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పీజీఆర్‌ఎస్ వినతులను రెండు పూటలా లాగిన్‌లో తనిఖీ చేయాలన్నారు. రెవెన్యూ పిటీషన్లకు సంబంధించి తహసీల్దార్లు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించారు. సమావేశంలో జేసీ సేతుమాధవన్, డీఆర్వో మురళి, సీపీఓ బాలాజీ, జిల్లా అఽధికారులు పాల్గొన్నారు.
చంపావతికి ఆండ్ర జలాశయం నీరు
గజపతినగరం: విజయనగరం మున్సిపాలిటీ ప్రజలకు తాగునీటిని అందించేందుకు గాను చంపావతి నదికి ఆండ్ర జలాశయం నీటిని మంగళవారం నుంచి పదిహేను రోజుల పాటు విడుదల చేయనున్నట్లు ఆండ్ర జలవనరుల శాఖాధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నదీ తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రోడ్డు ప్రమాదంలో
యువకుడి మృతి
గుమ్మలక్ష్మీపురం: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుమ్మలక్ష్మీపురం మండలం రేగిడి గ్రామానికి చెందిన పువ్వల కై లాష్ (24) మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. కై లాష్ జీవనోపాధి నిమిత్తం ఐదు నెలల కిందట రాజమండ్రి సమీపంలోని కోళ్లఫారంలో పనిచేసేందుకు భార్య సంతోషినితో కలిసి వెళ్లాడు. ఆదివారం రాత్రి పనిముగించుకుని ఇంటికి ద్విచక్ర వాహనంపై వస్తుండగా వాహనం అదుపుతప్పి పడిపోయాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్రగాయం కావడంతో కై లాష్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి ముగ్గురు పిల్లలు ఉండగా రేగిడి గ్రామంలోని తల్లి కౌశల్య, తండ్రి పాల్సుల వద్ద ఉంటున్నారు. మృతదేహానికి స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
కుక్కల దాడిలో
నాలుగు మేకల మృతి
మక్కువ: మండలంలోని దబ్బగుడ్డ గ్రామ సమీపంలో మేత మేస్తున్న మేకలపై కుక్కలు ఒక్కసారిగా దాడిచేయడంతో నాలుగు జీవాలు మృతి చెందిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన మేకల కాపరి బండి లక్ష్మి గ్రామ సమీపంలోని పొలం వైపు మేకలను మేతకు తీసుకువెళ్లింది. మేకలు మేస్తుండగా.. ఒక్కసారిగా కుక్కల గుంపు వచ్చి దాడి చేయడంతో అక్కడికక్కడే రెండు మేకలు మృతి చెందగా.. గాయపడిన మరో రెండు గ్రామానికి తీసుకువస్తుండగా మృతి చెందాయి. నాలుగు జీవాలు ఒక్కసారి మృతి చెందడంతో బాధితురాలు లక్ష్మి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.
గడువులోగా వినతులు పరిష్కరించాలి
గడువులోగా వినతులు పరిష్కరించాలి


