బాధ్యతగా పనిచేయాలి..
● కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి
పార్వతీపురం/పార్వతీపురం రూరల్: అధికారులు బాధ్యతగా వ్యవహరించి పీజీఆర్‌ఎస్‌లో తెలియజేసిన సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో సబ్ కలెక్టర్ డాక్టర్ ఆర్.వైశాలి, డీఆర్‌ఓ కె. హేమలత, డీఆర్‌డీఏ పీడీ ఎం. సుధారాణి, తదితరులతో కలిసి 103 అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొక్కుబడిగా కాకుండా బాధ్యతతో సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రతీ సమస్యకు సరైన పరిష్కారం చూపించాలని సూచించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
వచ్చిన అర్జీల్లో కొన్ని..
● పార్వతీపురం మండలం బొడ్డవలస గ్రామంలో సర్వే నెంబర్ 56లో ఉన్న భూమిని కొంతమంది ఆక్రమించుకున్నారని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు.
● చేపలను పెంచుకుంటున్న చెరువును ఆక్రమించుకుని తమ పొట్ట కొట్టారని గరుగుబిల్లి మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన కొండదొర, తదితరులు వినతిపత్రం అందజేశారు.
● పంచాయతీ భవన నిర్మాణానికి అటవీశాఖ అనుమతులు మంజూరు చేయాలని కోరుతూ పాచిపెంట మండలం చిట్టెలభ గ్రామానికి చెందిన ఎం. వెంకటరావు, తదితరులు అర్జీ సమర్పించారు. అలాగే చిట్టెలభ గ్రామానికి ఆశా కార్యకర్తను నియమించాలని కోరుతూ గ్రామానికి చెందిన డి. ఆనందరావు వినతిపత్రం అందజేశారు.
● తమ గ్రామంలో అంగన్‌వాడీ భవనం నిర్మించాలని కోరుతూ సీతంపేట మండలం రేగులగూడ సర్పంచ్ ఎన్. రమతో పాటు పలువురు వినతిపత్రం సమర్పించారు.
పీజీఆర్‌ఎస్‌కు భారీగా వినతులు
విజయనగరం కలెక్టరేట్: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు (పీజీఆర్‌ఎస్) ఈవారం భారీ స్థాయిలో వినతులు వచ్చాయి. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ మురళి, ఆర్డీఓ డి. కీర్తి, పలువురు ప్రత్యేక ఉప కలెక్టర్లు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 232 అర్జీలు స్వీకరించారు. ఎక్కువగా రెవెన్యూ సమస్యలపై 123 వినతులు రావడం విశేషం. వినతులను పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని డీఆర్‌ఓ మురళి ఆదేశించారు.
బాధ్యతగా పనిచేయాలి..


