భూ ఆక్రమణకు యత్నం
● స్తంభాలను పీకేసిన గిరిజనులు
పార్వతీపురం రూరల్: మండలంలోని జమదాల పంచాయతీ పరిధిలోని జంతికొండ వద్ద పోడు భూముల ఆక్రమణకు ఒకరు ప్రయత్నించగా.. స్థానిక గిరిజనులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామస్తుల కథనం ప్రకారం... మండలంలోని లక్ష్మీపురం, పొట్టి గదవవలస గ్రామాల గిరిజనులకు 2003లో ఈ కొండపై ప్రభుత్వం పోడు పట్టాలు మంజూరు చేసింది. అప్పటి నుంచి వారు అక్కడ జీడి, ఇతర పంటలు సాగు చేసుకుంటున్నారు. అయితే కందకం వెలుపల భూమిని కొనుగోలు చేసిన ఓ వ్యక్తి, కందకం దాటి లోపల ఉన్న టేకు, నీలగిరి చెట్లను నరికివేసి భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించాడు. దీనిపై వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు పి.రాము, గిరిజన సంఘం నాయకుడు రామస్వామి ఆధ్వర్యంలో గ్రామస్తులు గతంలోనే నిలదీశారు. తాజాగా సదరు వ్యక్తి సమీపంలో ఉన్న పుట్టురు నుంచి కూలీలను రప్పించి ఆక్రమిత భూమికి కంచె వేసేందుకు ప్రయత్నించగా, గమనించిన గ్రామస్తులు అక్కడికి చేరుకుని స్తంభాలను పీకివేశారు. ఏళ్ల తరబడి సాగులో ఉన్న తమ పట్టా భూములను కాపాడాలని కలెక్టర్, సబ్ కలెక్టర్, ఐటీడీఏ అధికారులను బాధితులు కోరుతున్నారు.


