తొలిరోజు లోపాలెన్నో..
రాజాం: పోలిపల్లి పైడితల్లి తొలిరోజు జాతరలో అధికారుల లోటుపాట్లు స్పష్టంగా కనిపించాయి. వందవ జాతర అని ప్రచార ఆర్భాటం చేసిన దేవదాయశాఖతో పాటు యాత్ర నిర్వాహకులు తొలిరోజు భక్తులకు సౌకర్యాలు కల్పించలేకపోయారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఇబ్బందులు తప్పలేదు. పోలీసులు తొలిరోజే తమ ప్రతాపం చూపించారు. వీఐపీ దర్శనాలు, వంద రూపాయల గేట్ల వద్ద అధిక సంఖ్యలో గస్తీగా ఉన్న పోలీసులు తమకు తెలిసిన వారిని ఆలయంలోకి విడిచిపెట్టి మిగిలిన వారికి చుక్కలు చూపించారు. వంద రూపాయల టిక్కెట్లు తీసుకున్న భక్తులు సైతం రెండు గంటలకుపైగా క్యూలో వేచి ఉండాల్సి వచ్చింది. వంద రూపాయల క్యూలైన్ పక్కనే ఉన్న ఎగ్జిట్ గేట్ నుంచి పోలీసులు తమ బంధువులు, తెలిసిన వారిని పంపించేశారు.
ఎక్కడికక్కడే బారికేడ్లు..
బొబ్బిలి జంక్షన్ నుంచి పైడితల్లి అమ్మవారి ఆలయం వరకు ఐదుచోట్ల బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో ఆదివారం యాత్ర చూసేందుకు వచ్చిన భక్తులకు ఇబ్బందులు తప్పలేదు. వీరితో పాటు కొండంపేట, ఆదర్శనగర్, అమ్మవారికాలనీ, వస్త్రపురికాలనీ, మెంతిపేట, ఎస్సీ కాలనీ, తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరో వైపు బావిరేవతమ్మగుడి, మెంతిపేట చిన్నవీధిలకు వెళ్లే దారుల సైతం మూసేశారు.
నిఘానేత్రాలేవీ
ఇంతపెద్ద యాత్రలో నిఘా నేత్రాలు ఎక్కడా కనిపించలేదు. ఆలయంలో దేవదాయశాఖకు సంబంధించిన సీసీ కెమెరాలు మినహా యాత్ర జరిగే ప్రాంతంలో, వినోద సామాగ్రి ఉండేచోట, బొబ్బిలి రోడ్డు ప్రాంతాల్లో ఎక్కడా పోలీసులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదు. ఒక్క కంట్రోల్ రూమ్ మాత్రమే కనిపించింది. దీంతో భక్తులకు ఇబ్బందులు తప్పలేదు.
పోలీసుల పెత్తనంతో భక్తుల్లో భయం
తొలిరోజు లోపాలెన్నో..


