గురువులకు బెత్తం దెబ్బ!
సాక్షి, పార్వతీపురం మన్యం:
ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు అధిక శాతం మంది గిరిజనులు, నిరక్షరాస్యులే. వారి చేతిలో సెల్‌ఫోన్లు అయితే ఉంటాయి గానీ.. వాటిని వినియోగించడం పూర్తిస్థాయిలో రాదు. అటువంటి వారికి ఐవీఆర్‌ఎస్ కాల్స్ వస్తే.. అటు నుంచి రికార్డెడ్ వాయిస్ కాల్ ద్వారా మాట వినిపిస్తే.. మీ పిల్లలు చదువు ఎలా ఉంది? పాఠాలు బాగా చెబుతున్నారా? భోజనం బాగా పెడుతున్నారా? ఇలా పలు ప్రశ్నలు వేసి.. అవును అయితే ఒకటి నొక్కండి, కాదు అంటే రెండు నొక్కండి అని చెబితే... నిరక్షరాస్యులు చేయగలరా? కచ్చితమైన సమాచారం ఇవ్వగలరా? ఇలా ఫోన్లు వచ్చిన సందర్భంలో ఏమీ తెలియని తల్లిదండ్రులు.. ఇదేదో స్పామ్ కాల్ అని భావించి, భయపడి వెంటనే కట్ చేస్తున్నారు. చెప్పింది కూడా పూర్తి స్థాయిలో వినని పరిస్థితి. ఇప్పుడు అదే ఆశ్రమ పాఠశాలల హెచ్‌ఎంలు, డిప్యూటీ వార్డెన్ల మెడకు చుట్టుకుంది. జిల్లాలోని పలు ఆశ్రమ విద్యాలయాల పని తీరు కనీస సంతృప్తి స్థాయిని అందుకోలేదన్న కారణంతో పలువురికి నోటీసులు ఇచ్చేందుకు రాష్ట్ర స్థాయి అధికారులు సిద్ధం అవుతున్నట్లు తెలిసింది. కొంతమందికి మొట్టి కాయలు వేసేందుకు రాష్ట్ర కార్యాలయానికి రావాలని పిలుపు వచ్చినట్లు సమాచారం.
● ఇప్పటికే ఫొటోల టెన్షన్..
పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో 21 మంది ప్రధాన ఉపాధ్యాయులకు సకాలంలో ఫొటోలు అప్‌లోడ్ చేయలేదన్న కారణంతో మెమోలు జారీ చేసిన విషయం విదితమే. దీనిపై ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇటువంటి చర్యలను ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. నిరసనలకు సిద్ధం అవుతున్నాయి. మరోవైపు ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో కనీస సౌకర్యాలు ఉండడం గగనంగా మారింది. క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. విద్యార్థులకు సమయానికి రుచికరమైన భోజనం అందించడానికి కుక్, కమాటీలు అవసరం. ఏ హాస్టల్‌లోనూ కుక్, కమాటీలు లేరు. దీనివల్ల ఆయా వార్డెన్లు డబ్బులు చెల్లించి ప్రైవేట్ వ్యక్తులతో వంటలు చేయిస్తున్నారు. ఇటీవల కాలంలో పదుల సంఖ్యలో గిరిజన విద్యార్థుల మరణాలు సంభవించాయి. విద్యార్థుల ఆరోగ్య సంరక్షణ కోసం ఏఎన్‌ఎంల నియామకం చేపట్టాల్సి ఉన్నా.. ప్రభుత్వం నుంచి కనీసం స్పందన లేదు. దీంతో కొన్నిచోట్ల వార్డెన్లు, హెచ్‌ఎంలే రూ.5 వేలు వరకూ సొంత డబ్బులు వెచ్చించి ఏఎన్‌ఎంలను నియమించుకుంటున్నారు. విద్యార్థుల రక్షణ కోసం నైట్ వాచ్‌మెన్‌లను నియమించాల్సి ఉంది. ఇన్ని సమస్యలు క్షేత్ర స్థాయిలో ఉన్నా.. వాటిని అధికారులు పరిష్కరించడం.. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం చేయాలి. జిల్లాలో ఇటువంటి పరిస్థితి కానరావడం లేదు. ఉపాధ్యాయులను స్టడీ అవర్స్, రాత్రి బసల పేరిట ఒత్తిడి చేస్తున్నారు. రాత్రి స్టడీ అవర్స్ పూర్తయ్యాక అక్కడ ఉండటానికి ఎటువంటి వసతులూ లేవని.. ఆ సమయంలో ఇంటికి రావడానికి వీలు కావడం లేదని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. వీటికి తోడు ఉదయం 9 గంటల లోపు హాజరు ఫొటోలను అప్‌లోడ్ చేయాలని ఒత్తిడికి గురిచేస్తూ, ఆలస్యం అయితే మెమోలు ఇవ్వడం ఎంత వరకు సమంజసమని యూనియన్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ, ఉపాధ్యాయులను కేవలం బోధనకు మాత్రమే పరిమితం చేస్తూ.. ప్రతి హాస్టల్‌కూ రెగ్యులర్ వార్డెన్‌ల నియామకం చేపడితేనే అనుకున్న ఫలితాలు వస్తాయి. అధికారులు, ప్రభుత్వం ఈ బాధ్యతల నుంచి తప్పుకుని ఉపాధ్యాయులను బాధ్యులను చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పేదకుటుంబాల పిల్లలకు బంగారు భవితను అందించే ప్రభుత్వ విద్యాలయాలపై చంద్రబాబు ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందన్న ఆవేదన వ్యక్తమవుతోంది.
ఉపాధ్యాయులపై ఒత్తిడి చేయడం తగదు..
గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో 21 మంది ప్రధాన ఉపాధ్యాయులకు సకాలంలో ఫొటోలు అప్‌లోడ్ చేయలేదన్న కారణంతో మెమోలు జారీ చేయడం అన్యాయం. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. బోధనేతర పనులు అప్పగిస్తూ మానసిక ఆందోళనకు గురిచేయడం వల్ల ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. అనారోగ్య సమస్యలకు లోనవుతున్నారు. తాత్కాలిక విధానంలో అయినా వసతి గృహాల్లో సంరక్షకులను నియమించి, ఉపాధ్యాయులపై ఒత్తిడి తగ్గించాలి.
– మువ్వల అమర్‌నాథ్, ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ఆశ్రమ పాఠశాలల హెచ్‌ఎంలకు టెన్షన్
కొత్తగా ఐవీఆర్‌ఎస్ కాల్స్ బెడద
తల్లిదండ్రుల నుంచి సంతృప్తి స్థాయి లేకుంటే చర్యలు
ఇప్పటికే సమయానికి ఫొటోలు అప్‌లోడ్ చేయలేదని మెమోలు


