పాత జీపీఎఫ్ పింఛన్ అమలుకు విద్యుత్ ఉద్యోగుల డిమాండ్
తెర్లాం: విద్యుత్ సంస్థలో 1999 ఫిబ్రవరి నుంచి 2004 ఆగస్టు 31 మధ్య నియమితులైన ఉద్యోగులందరికీ పాత జీపీఎఫ్ పింఛన్ అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల సంఘం (రి.నెం.1104) విజయనగరం జిల్లా కార్యదర్శి సురగాల లక్ష్మణ్ డిమాండ్ చేశారు. తెర్లాంలో ఆ సంఘ సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతేడాది అక్టోబర్ నెలలో చేసిన సమ్మె కాలంలో ప్రభుత్వం రెండు నెలల్లో పాత జీపీఎఫ్ పింఛన్ అమలు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇంతవరకు నెరవేర్చకపోవడం దారుణమన్నారు. తక్షణమే పే రివిజన్ కమిటీని నియమించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘ రీజనల్ అధ్యక్షుడు వంగపండు లక్ష్మణ, రాష్ట్ర నాయకులు గేదెల దేముడు, జిల్లా నాయకులు బి.కూర్మారావు, జి.అప్పలనాయుడు, భోగి సూరి, రెడ్డి శ్రీధర్, ఎన్.వెంకటేశ్వర్లు, పి.మల్లికార్జున, తదితరులు పాల్గొన్నారు.


