డ్రైవింగ్ స్కూళ్ల దందాపై.. రవాణా శాఖ కొరడా
విజయనగరం గంటస్తంభం: జిల్లాలో డ్రైవింగ్ స్కూళ్ల కార్యకలాపాలపై రవాణా శాఖ కఠిన నిఘా కొనసాగిస్తోంది. మోటార్ వెహికల్ చట్టం సెక్షన్–24 ప్రకారం నిబంధనలు పాటించని మూడు డ్రైవింగ్ స్కూళ్ల లైసెన్సులను రద్దు చేసింది. పది స్కూళ్ల లైసెన్సులను సస్పెండ్ చేసినట్టు అధికారులు వెల్లడించారు. లైసెన్స్ రద్దు చేసిన వాటిలో శ్రీబాలాజీ, అఖిల, జూమ్ జూమ్ డ్రైవింగ్ స్కూల్స్ ఉన్నాయి. అలాగే శ్రీ గీత, సత్య, శ్రీ గణేష్, చారవి, రఘనందన్, అమ్మ, ఎస్కేఎమ్‌ఎల్, గీత, నాగగంగ భవాని, శ్రీదేవి డ్రైవింగ్ స్కూళ్ల లైసెన్సులు సస్పెండ్ అయ్యాయి. నిబంధనల ఉల్లంఘన, తగిన మౌలిక సదుపాయాల లోపం, శిక్షణ ప్రమాణాల నిర్లక్ష్యం వంటి కారణాలతో ఈ చర్యలు తీసుకున్నట్టు రవాణా శాఖ అధికారులు వెల్లడించారు.
మోసం..
అనుభవం లేని బోధకులు అభ్యాసకులను తక్కువ సమయంలో వాహనాలు నడపమని ఒత్తిడి చేయడం, వెంటనే లైసెన్స్ కోసం దరఖాస్తు చేయమని ప్రోత్సహించడం వంటి తప్పుడు విధానాలు బయటపడ్డాయని డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ తెలిపారు. డ్రైవింగ్ అంటే కేవలం స్టీరింగ్ పట్టడం కాదని, రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలు, వాహన నియంత్రణపై సమగ్ర అవగాహన అవసరమని పేర్కొన్నారు. తక్షణ లైసెన్స్ మంత్రాలు ప్రమాదాలకు దారితీస్తాయని స్పష్టం చేశారు.
జిల్లా వ్యాప్తంగా దాడులు
జిల్లా వ్యాప్తంగా 27 మండలాల్లో నాలుగు ప్రత్యేక బృందాలుగా విభజించి, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లుతో తనిఖీలు నిర్వహించారు. మౌలిక సదుపాయాలు, శిక్షణ ప్రమాణాలు, బోధకుల అర్హతలు వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
గీతా డ్రైవింగ్ స్కూల్ సీజ్
గజపతినగరంలోని గీతా డ్రైవింగ్ స్కూల్‌లో ఒకే లైసెన్స్‌తో రెండు వాహనాలు నడుపుతున్నట్టు గుర్తించిన అధికారులు స్కూల్‌ను సీజ్ చేశారు. కనీస సదుపాయాలు లేకుండా, అభ్యాసకుల భద్రతను పణంగా పెట్టే వ్యవహారాలపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
భద్రత మరిచిన డ్రైవింగ్ పాఠశాలలు
కొన్ని డ్రైవింగ్ స్కూళ్లు శిక్షణ కంటే ఆదాయంపైనే దృష్టి పెట్టి, మొదటి రోజే వాహనం నడిపిస్తూ లైసెన్స్ అప్లికేషన్‌లకు దారి తీస్తున్నాయని రవాణా శాఖ గమనించింది. మిడిమిడి శిక్షణ వల్లే ప్రమాదాలు అధికం అవుతున్నాయని అధికారులు గుర్తించారు. డ్రైవింగ్ పాఠశాలలు అంటే సమగ్ర శిక్షణ కేంద్రాలు కావాలని, లైసెన్స్ దుకాణాలు కాదని అధికారులు మండిపడ్డారు.
నిబంధనలు పాటించకపోతే..
రవాణా శాఖ నియమాలు, భద్రతా ప్రమాణాలు పాటించని ఏ డ్రైవింగ్ స్కూల్‌పై అయినా ఉక్కుపాదం మోపుతామని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే పలువురు నిర్వాహకులకు వార్నింగ్‌లు జారీ కాగా, పలు స్కూల్స్ మూతపడినట్టు తెలియజేశారు.
ప్రత్యేక ఇన్సూరెన్స్ తప్పనిసరి
డ్రైవింగ్ స్కూళ్లు వాహనాలకు నిబంధనల ప్రకారం సరైన ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని రవాణా శాఖ అధికారుల సూచించారు. ఎల్లో బోర్డు వాహనాలకు కమర్షియల్ విధానానికి అనుగుణంగా ప్రత్యేక ఇన్సూరెన్స్ తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఓన్ బోర్డులతో కార్యకలాపాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
భద్రతపై రాజీ లేదు..
డ్రైవింగ్ స్కూళ్లు భద్రతా ప్రమాణాలు, శిక్షణ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని రవాణా శాఖ హెచ్చరించింది. అభ్యాసకుల భద్రతను దృష్టిలో ఉంచుకొని తనిఖీలు కొనసాగుతాయని, నిబంధనలు పాటించని సంస్థలపై కఠిన చర్యలు తప్పవని అధికారులు తెలిపారు.
డ్రైవింగ్ స్కూల్స్ పనితీరుపై జిల్లా
వ్యాప్తంగా తనిఖీలు
అనుభవం లేని బోధకులపై రవాణా శాఖ దాడులు
నిబంధనలు తుంచిన డ్రైవింగ్ స్కూళ్లపై ఉక్కుపాదం
నిబంధనలు ఉల్లంఘించిన మూడు స్కూళ్లు రద్దు


