గంజాయి, డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలు
బొబ్బిలి: గంజాయి సేవిస్తున్న, చలామణీ చేస్తున్న ఒక మైనరు సహా 12మంది విద్యార్థులు, యువతను ఎన్‌డీపీసీ చట్టం కింద పలు సెక్షన్లు నమోదు చేసి అరెస్టు చేసినట్టు డీఎస్పీ జి.భవ్యారెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం స్థానిక పోలీసుస్టేషన్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బొబ్బిలి సమీపంలోని కోమటిపల్లి శివారులోని తాండ్ర పాపారాయ కాలేజీ్ సమీపంలో గురువారం మధ్యాహ్నం 4 గంటల సమయంలో కొందరు యువత గంజాయి వినియోగిస్తున్నట్టు తమకు సమాచారం అందిందన్నారు. తమ సిబ్బందిని అక్కడకు పంపించిన వెంటనే వారిని చూసి నిందితులు పారిపోబోతుండగా పట్టుకుని అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిలో ఒకరు జువెనల్ కాగా మిగతా 11 మంది యువతన్నారు. వీరంతా గంజాయి కలిగి ఉండటంతో వారిని అరెస్టు చేసినట్టు చెప్పారు. వీరి నుంచి 4కిలోల 774 గ్రాముల గంజాయిని, 8 సెల్‌ఫోన్లను, ఒక మోటారు సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.
విద్యాసంస్థల సమీపంలోనే విక్రయాలు
గంజాయిని కలిగి ఉండటంతో అరెస్టు చేసిన వారిని ప్రాధమికంగా విచారించామని డీఎస్పీ భవ్యారెడ్డి చెప్పారు. ఈ విచారణలో ముగ్గురు వ్యక్తులు రాయగడలో కొనుగోలు చేసి విద్యార్థులు, యువతకు విక్రయిస్తున్నట్టు గుర్తించామన్నారు. ప్రధానంగా సీతానగరం మండలానికి చెందిన గణేష్ అనే వ్యక్తి ప్రధాన సూత్రధారిగా ఉన్నాడని స్పష్టం చేశారు. బొబ్బిలికి చెందిన చోడిపల్లి అఖిల్, గొల్లపల్లికి చెందిన లంక చందు కలసి రాయగడ వెళ్లి గంజాయి సులువుగా కొనుగోలు చేసి తీసుకువస్తున్నారన్నారు. అక్కడి నుంచి తీసుకువచ్చిన గంజాయిని స్థానిక యువతకు విక్రయిస్తున్నట్టు గుర్తించామన్నారు. ఇందంతా పెద్ద నెట్‌వర్క్ అనీ దానిని ఛేదిస్తున్నామన్నారు. త్వరలోనే మరిన్ని వివరాలను సేకరించి బయటపెట్టనున్నట్టు స్పష్టం చేశారు.
విద్యార్థులు, నిరుద్యోగులే లక్ష్యం
రాయగడలో కొనుగోలు చేసిన గంజాయిని ప్రధాన నిందితులు పట్టణం, పరిసర ప్రాంతాల్లో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ వసతి గృహాలు, స్కిల్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లలోని విద్యార్థులే లక్ష్యంగా విక్రయిస్తున్నట్టు ప్రాధమికంగా గుర్తించామన్నారు. ముగ్గుర్ని రిమాండ్ నిమిత్తం పంపిస్తున్నట్టు చెప్పారు. గంజాయి వినియోగం, రవాణా వంటి నేరాల్లో పట్టుబడ్డ వారిని ఉపేక్షించేదే లేదన్నారు. కేసులో మరింత మందిని అరెస్టు చేయనున్నట్టు వెల్లడించారు.
ఈవ్‌టీజింగ్‌పై గట్టి నిఘా
బొబ్బిలిలో ఈవ్ టీజింగ్ కనిపిస్తోందని డీఎస్పీ భవ్యారెడ్డి అన్నారు. ఆడపిల్లలతో తప్పుడు మాటలు ఆడినా, తప్పుడు పనులు చేసినా అరెస్టు చేయనున్నట్టు చెప్పారు. బాలికలు కనిపించినప్పుడు వేషాలు వేసినా, ఏ విధమైన వెకిలి చేష్టలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్పీ దామోదర్ ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో వెనుకాడవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారన్నారు. సీఐ కె.నారాయణ రావు, ఎస్సై ఆర్.రమేష్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
మైనర్ సహా 11 మంది గంజాయి నిందితుల అరెస్టు
రిమాండ్‌కు ముగ్గురు తరలింపు
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే వదిలిపెట్టేది లేదు..: డీఎస్పీ


