జిల్లా ఆస్పత్రిలో క్లిష్టమైన శస్త్రచికిత్స సక్సెస్
పార్వతీపురం రూరల్: తీవ్ర రక్తహీనత, గర్భసంచి కణితులతో బాధపడుతున్న ఓ మహిళకు పార్వతీపురం జిల్లా కేంద్ర ఆస్పత్రి వైద్యులు గురువారం క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. కురుపాం మండలం యేగులవాడకు చెందిన మండంగి సరస్వతి గత నెల 26న తీవ్ర నడుపునొప్పితో ఆస్పత్రిలో చేరారు. ఆమెను పరీక్షించిన వైద్యులు గర్భసంచిలో నిండు గర్భిణి పరిమాణంలో కణితలు ఉన్నట్లు గుర్తించారు. రోగికి హిమోగ్లోబిన్ శాతం కేవలం 4.6 గ్రాములు ఉండటంతో, వైద్యులు తొలుత నాలుగు ప్యాకెట్ల రక్తాన్ని ఎక్కించి 9.6 గ్రాములకు పెంచారు. అనంతరం ఫిబ్రవరి 19న సుమారు నాలుగు గంటల పాటు శస్త్ర చికిత్స నిర్వహించి కణితులతో పాటు గర్భసంచిని తొలగించారు. గతంలో జరిగిన ఒక ఆపరేషన్ కారణంగా పేగులు, మూత్ర నాళం గర్భసంచికి అతుక్కుపోవడంతో శస్త్రచికిత్స అత్యంత క్లిష్టంగా మారిందని వైద్యులు తెలిపారు. మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగ శివజ్యోతి పర్యవేక్షణలో డీసీహెచ్‌ఎస్ డా. నాగభూషణరావు, గైనకాలజిస్టులు డా.జయశ్రీ, డా.సౌమ్యశ్రీ, అనస్థీషియా వైద్యులు డా.రామారావు, డా.ధనుంజయ, సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్యం స్థిరంగా ఉందని, ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.


