‘ఉపాధి’ కల్పనలో రాజకీయమా?
రామభద్రపురం: గ్రామాల్లో రాజకీయాలు చేసి ఉపాధిహామీ వేతనదారుల బతుకులతో ఆటలాడుకోవద్దని జన్నివలస గ్రామ వేతనదారులు శుక్రవారం ఎంపీడీఓ కార్యాలయంలో ఏపీఓను నిలదీశారు. అనంతరం కాసేపు ఆందోళన చేశారు. వివరాల్లోకి వెళ్తే.. జన్నివలసలో ఉపాధిహామీ పనులు కల్పించాలని కోరుతూ ఈ నెల 2న 12 గ్రూపులకు చెందిన వేతనదారులు డిమాండ్ పత్రాలు అందజేశారు. అందులో కేవ లం ఐదు గ్రూపులకు చెందిన డిమాండ్ పత్రాలలో ఉన్న వేతనదారుల పేర్లు మాత్రమే ఆన్‌లైన్ చేశారు. విషయం గోప్యంగా ఉంచి అన్ని గ్రూపులకు చెందిన వేతనదారులు పనుల్లో పాల్గొనాలని ఏపీఓ సూచించారు. ఆ మేరకు పనికి వెళ్తున్నా మస్తర్లు వేయకపోవడంతో వారం రోజుల పాటు వేచిచూశారు. ఎప్పటికీ ఏపీఓ స్పందించకపోవడంతో సుమారు 100 మంది వేతనదారులు ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకుని ఏపీఓను చుట్టుముట్టారు. తమకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించారు. అన్యాయం చేయాలని చూస్తే మా ఉసురుతగులుతుందంటూ శాపనార్థాలు పెట్టారు. న్యాయం చేయకుంటే కలెక్టర్‌కు ఫిర్యాదుచేస్తామని స్పష్టంచేశారు.
● ఏపీఓను నిలదీసిన జన్నివలస వేతనదారులు


