18 ఏళ్లు నిండిన మహిళలకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 చొప్పున ఇస్తామంటూ ఎన్నికల్లో చంద్రబాబు హామీ
అధికారంలోకి వచ్చి 20 నెలలైనా ఆ ఊసే ఎత్తని టీడీపీ సర్కార్
ఓట్ల కోసం నిధితో గాలం వేశారంటూ వాపోతున్న మహిళలు
విజయనగరం ఫోర్ట్: టీడీపీని అధికారంలోకి తీసుకొస్తే 18 ఏళ్లు నుంచి 59 వయసు గల ప్రతీ మహిళకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు అందిస్తాం... చెల్లెమ్మలూ మరచిపోవద్దు అంటూ ప్రస్తుత సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యేలు, మంత్రులు మైక్ పట్టుకుని ఊరూరా ప్రచారం చేశారు.
గ్రామస్థాయిలో ఉన్న టీడీపీ నాయకులు సైతం ప్రతీఇంటికి వెళ్లి 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1500 ఇస్తారని, పార్టీకి ఓటేయాలంటూ బ్రోచర్లు, కరపత్రాలు అందజేసి ప్రచారం చేశారు. ఇదంతా నిజమని నమ్మిన మహిళలు టీడీపీకి అధికారం కట్టబెట్టారు. తీరా ఇప్పుడు మోసపోయామంటూ గగ్గోలుపెడుతున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా ఒక్క మహిళకు కూడా ఆడబిడ్డ నిధి ఇచ్చిన పాపాన పాలేదని, ‘ఏరుదాటేవరకు ఏరు మల్లన్న... ఏరుదాటాక బోడి మల్లన్న’ అనే సామెత చందాన చంద్రబాబు సర్కార్ తీరు తయారైందంటూ ఆవేదన చెందుతున్నారు. సూపర్ సిక్స్ అంటూ తమకు మోసం ఫిక్స్‌చేశారని మండిపడుతున్నారు.
ఇదీ పరిస్థితి...
జిల్లాలో 18 ఏళ్లు నుంచి 59 ఏళ్ల వయసు గల మహిళలు సుమారుగా 7.50 లక్షల మంది ఉన్నారు. ఆడబిడ్డ నిధి కింద మహిళలకు నెలకు రూ.1500 చొప్పున 20 నెలలకు ఒక్కో మహిళకు రూ.30 వేలు చంద్రబాబు ప్రభుత్వం ఇవాల్సి ఉంది. ఈ లెక్కన మహిళలందరికీ 20 నెలలకు సంబంధించి రూ.2,250 కోట్లు వరకు చంద్రబాబు సర్కార్ చెల్లించాల్సి ఉంది. ఒక్క రూపాయి కూడా విదల్చకపోవడం, బడ్జెట్‌లో సున్నా కేటాయింపులతో మహిళలను చంద్రబాబు ప్రభుత్వం బురిడీ కొట్టించింది. ఆడబిడ్డ నిధిని అటకెక్కించింది.
ఒక్కొక్కరికి ఆడబిడ్డ నిధి కింద 20 నెలల కాలానికి చెల్లించాల్సిన మొత్తం రూ.30 వేలు
విజయనగరం జిల్లాలో 18 నుంచి 59 ఏళ్ల వయసు ఉన్న మహిళల సంఖ్య సుమారుగా 7.50 లక్షలు
వైఎస్సార్‌సీపీ హయాంలో రూ.18,750 చొప్పన సాయం
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్సార్ చేయూత పథకం కింద 45–60 ఏళ్ల మధ్యన ఉన్న ప్రతి మహిళకు ఏడాదికి రూ.18,750 చొప్పన ఐదేళ్ల పాటు ఆర్థిక సాయం అందించారు. పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా అందజేశారు. ఐదేళ్లపాటు వేలాది మంది మహిళలకు లబ్ధి చేకూర్చారు. చంద్రబాబు సర్కార్ మాత్రం మహిళలకు ఇచ్చిన హామీని గాలికి వదిలేసింది.


